ఆ అవ్వే మరణిస్తే.. ఆ బిడ్డలకు దిక్కెవ్వరు !
పెద్దతిప్పసముద్రం : జీవిత చరమాంకంలో కన్న బిడ్డల వద్ద కాలం వెళ్లదీద్దామని కన్నవాళ్లు ఎన్నో కలలు కంటారు. కానీ దురదృష్టవశాత్తు తోడూ నీడ లేని ఓ నిరుపేద పండుటాకు ఇంతటి వృద్ధాప్యంలోనూ అమ్మానాన్నలకు దూరమైన ముగ్గురు పిల్ల ల బాధ్యతను మోస్తూ.. కనాకష్టంగా బతుకీడుస్తూ ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తోంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన ఓ వృద్ధురాలి వ్యథాభరిత గాథ ఇది.. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త అకాల మరణం చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం చేస్తే నాలుగేళ్ల క్రితం ఆమె కరోనాతో మృతి చెందింది. ఆ వెంటనే అల్లుడు సైతం కన్న బిడ్డలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో కుమార్తెకు కలిగిన ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఈ పండుటాకు పడుతున్న కష్టాన్ని చూసిన వారు అయ్యో.. ఆ అవ్వే మరణిస్తే.. ఆ బిడ్డలకు దిక్కెవ్వరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దతిప్పసముద్రం మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కలాయి పీరాన్‌సాబ్, మెహరున్నీసా దంపతులు. వీరికి రెడ్డి ప్యారీ అనే ఒక్కగానొక్క కుమార్తె సంతానం. గతంలో ఎప్పుడో మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో జీవనం సాగిస్తూ వస్తున్నారు. 17 ఏళ్ల క్రితం మెహరున్నీసా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త అకాల మరణం, మరో వైపు పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం ఎలా చేయాలో దిక్కుతోచక ఆమె లోలోపలే కుమిలిపోయింది. ఈ నేపథ్యంలో కూలీ, నాలీ చేసి అతి కష్టంతో 13 ఏళ్ల క్రితం కుమార్తె రెడ్డిప్యారీకి షఫీ అనే వ్యక్తితో వివాహం జరిపించింది. వీరికి రేష్మా, రెడ్డిబాషా, షఫీ అనే ముగ్గురు సంతానం. దినసరి కూలి పనులు చేసుకుంటూ కుమార్తె, అల్లుడు పెద్దతిప్పసముద్రంలోనే జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం కుమార్తె రెడ్డిప్యారీని కరోనా మహమ్మారి కబళించింది. ఆమె మృతి చెందిన మూడు నెలలకే ముగ్గురు పిల్లలను వదిలి ఆమె భర్త షఫీ ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ పిల్లలను అమ్మమ్మ దరి చేర్చుకుంది. ముగ్గురు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో చేర్పించింది. ప్రభుత్వం ఇచ్చే యూనిఫారం.. లేదంటే చిరిగిన.. చాలీచాలని పాత దుస్తులే ఆ పిల్లలకు దిక్కు.. వారికి ఓ పుట్టిన రోజు లేదు.. ఓ పండుగ లేదు.. ఒకవేళ ఏ జ్వరమో వస్తే మందులషాపులో టాబ్లెట్‌లు కొనుక్కునే స్థోమత కూడా లేదు. ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే కష్టంగా అర్థాకలితో అలమటిస్తున్న ఈ చిన్నారుల దీన స్థితిని కళ్లారా చూసిన వారు అయ్యో.. అంటూ జాలిపడుతున్నారు. ఆ పండుటాకుకు ప్రభుత్వం నుంచి వచ్చే నెలవారి పింఛన్, రేషన్ సరుకులే జీవనాధారం. అయినా కష్టాలను.. కన్నీళ్లను దిగమింగుతూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తన ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో, ఈ పిల్లలు ఎక్కడ అనాథలు అయిపోతారో, వారి బాగోగులు ఎవరు చూసుకుంటారో అంటూ ఈ అవ్వ దిగులు పడుతూ కంటతడి పెడుతుంటే ఆ మాటలు విన్న వారి హృదయం తరుక్కుపోతోంది. ఇంతటి కష్టంలోనూ ఆ అవ్వ ఓ అంత్యోదయ కార్డు మంజూరు చేయమని.. అభం శుభం తెలియని తన పసి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వమని మాత్రమే వేడుకుంటోంది. అటు ప్రభుత్వం.. ఇటు మానవతా వాదులు స్పందించి కష్టాల కడలి నుంచి ఆ కుటుంబాన్ని గట్టెక్కించాల్సిన అవసరం ఉంది.
17 ఏళ్ల క్రితం భర్త అకాల మరణం
నాలుగేళ్ల క్రితం కరోనాతో
ఒక్కగానొక్క కుమార్తె మృతి
కుమార్తె మృతి చెందిన మూడు నెలలకే పిల్లలను వదిలి అల్లుడు పరార్
ఆదుకునే వారి కోసం
ఓ వృద్ధురాలి ఎదురుచూపు
Comments
Please login to add a commentAdd a comment