షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
రాయచోటి : జిల్లాలో గిరిజనులు, వారి నివాస ప్రాంతాల అభివృద్ధికి పక్కాగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం మంతన్ శివిర్‌లో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దర్తీ ఆభా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద జిల్లా మంతన్ సివిర్ సమావేశం నిర్వహించాలని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం క్రింద గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, వైద్య, ఆరోగ్య, డీఆర్‌డీఏ, డ్వామా, పంచాయతీ, ఐసీడీఎస్, ఫిషరీస్ తదితర శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
బ్యాంకర్లు సహకరించాలి
బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి అందించే రుణాలకు బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సమన్వయ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని జిల్లా బీసీ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు తదితర వివరాలను జిల్లా కలెక్టర్‌కు, కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కార్పొరేషన్లను, ఆర్థికంగా వెనుకబడిన వివిధ వర్గాల వారి కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సహకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎల్‌డీఎం ఆంజనేయులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment