● ఇప్పటిదాకా భయం లేదు
దట్టమైన అడవితో కూడిన హార్సిలీహిల్స్
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్ చుట్టూ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో మనుగడ సాగిస్తున్న చిరుతల సంఖ్య ఐదుకు చేరాయన్న అంచనాకు అటవీశాఖ వచ్చింది. దీంతో వీటి మనుగడకు ఇబ్బందులు తలెత్తకుండా, వన్యప్రాణులకు హాని కలగని విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏడాదిగా చిరుతల సంచారం అధికం కావడం, కనిపిస్తున్న చిరుతలు ఒకలా కాకుండా వేర్వేరుగా ఉండటం బట్టి వాటి వయసును అంచనా వేస్తున్నారు. హార్సిలీహిల్స్‌కు వచ్చే సందర్శకులు చిరుతల కారణంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికి ఇంతవరకు మనుషులకు ఎలాంటి హాని కలగకపోవడంతో ఆ వైపుగా ఆందోళన లేదు. దట్టమైన హార్సిలీహిల్స్ అటవీప్రాంతం సరిహద్దు, కర్ణాటకలోని రాయల్పాడు అటవీ ప్రాంతాలు కలిసిపోయి ఉంటాయి. అత్యధిక విస్తీర్ణం కలిగిన అడవిలో చిరుతల సంచారం, వాటి సంతతి పెరిగినట్టు అటవీశాఖ లెక్కలు వేస్తోంది.
2011లోనే నాలుగు చిరుతలు
2011లో హార్సిలీహిల్స్ అడవిలో నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్టు అధ్యయనం ఆధారంగా గుర్తించారు. వీటిలో ఒక ఆడ, ఒక మగ చిరుత, రెండు చిరుత పిల్లలుగా నిర్ధారించారు. చిరుతల పాదముద్రల ఆధారంగా లెక్క తేల్చారు. తర్వాత నాలుగేళ్లకు నిర్వహించిన అధ్యయనంలో ఒకటి మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన మూడు చిరుతలు ఇక్కడి నుంచి సత్యసాయి జిల్లాకు లేదా కర్ణాటకలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉంటాయని అటవీశాఖ భావించింది. హార్సిలీహిల్స్ తూర్పున కురబలకోట మండలం తెట్టు, దక్షిణాన కర్ణాటకలోకి రాయల్పాడు. పడమర గట్లమీదపల్లె, మొటుకు, మొగసాలమర్రి, చలిమామిడి వరకు విస్తరించి ఉంది. 1882లో బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన మేరకు 6,231 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇదికాక ఏ రిజర్వ్‌ఫారెస్ట్ 1,348 హెక్టార్లు, బీ రిజర్వ్ ఫారెస్ట్ 1,176 హెక్టార్లు కలుపుకొని మొత్తం 8,755 హెక్టార్లలో దట్టమైన అడవి విస్తరించింది. దట్టమైన అడవి కారణంగా చిరుతల సంఖ్య నాలుగుకు పెరిగినా తర్వాత ఒక చిరుత మాత్రమే ఆవాసం చేసుకొన్నట్టు గుర్తించారు. కాండ్లమడుగు బీటులో చిరుత పులి పాదాన్ని గుర్తించి వయసు 8 ఏళ్లు ఉంటుందని లెక్క గట్టారు. చిరుతలు తమ ఆవాసాన్ని మార్చుకొన్నట్టు అప్పట్లో అటవీ అధికారులు నిర్ణయానికి వచ్చారు.
ఇప్పుడు ఐదుకు పెరిగాయి
సాధారణంగా చిరుతలు100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తుంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. దీన్ని పరిశీలిస్తే..హార్సిలీహిల్స్ అడవికి సమీపంలో బత్తలాపురం సండ్రడివి, అక్కడినుంచి సత్యసాయి జిల్లాలో అడవులు ఉన్నాయి. కొండకు ఆనుకునే కర్ణాటక ఆటవీ ప్రాంతం అత్యధికంగా ఉంది. దీనితో చిరుతలు అటు ఇటు సంచరిస్తూ మళ్లీ హార్సిలీహిల్స్ అడవిలోకి వచ్చాయని కూడా భావిస్తున్నారు. ఇక్కడ చిరుతల సంఖ్య పెరగడానికి అధికారుల అంచనా ప్రకారం హార్సిలీహిల్స్ అడవిలో వన్యప్రాణుల సంఖ్య అత్యధికంగా ఉంది. వాటికి అవసరమైన ఆహారం వేటాడేందుకు ఇవి సరిపోతాయి. ముఖ్యంగా కణితలు, దుప్పులను చిరుతలు అధికంగా వేటాడతాయి. ఇప్పటి వరకు సందర్శకులకు కనిపించిన చిరుతల ఎత్తు, వాటి లావును బట్టి విశ్లేషిస్తున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నదేమిటంటే..ఒక ఆడ, మగ చిరుత కచ్చితంగా ఉన్నాయని, మిగిలినవి వాటి సంతానం కావచ్చు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చిరుతల సంచారం పెరిగిన కారణంగా సందర్శకులు రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా బైక్‌పై వచ్చే సందర్శకులు చీకటి పడక ముందే వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
ఐదు రోజుల క్రితం రాయచోటి,
మదనపల్లె వాసులకు కనిపించిన
రెండు వేర్వేరు చిరుతలు
వీటి సంఖ్య ఐదుకు
పెరిగినట్టు అంచనా
ఏడాదిగా సందర్శకులకు కనిపిస్తూనే ఉన్నాయి
సందర్శకులకు కనిపిస్తున్న దాన్ని బట్టి హార్సిలీహిల్స్ అడవిలో చిరుతల సంఖ్య ఐదుకు పెరిగిందన్న అంచనాకు వచ్చాం. ఏయే వన్యప్రాణులు ఉన్నాయి, వాటి సంఖ్యను లెక్కించే ప్రక్రియ మార్చి తర్వాత ప్రారంభం కానుంది. అప్పటికి చిరుతల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నాం. ఇవి మనుషులపై దాడి చేయకపోవడం శుభపరిణామం. ఒక్కసారి మనిషిపై దాడికి పూనుకుంటే ఇక తీవ్రమైన పరిస్థితులు నెలకొంటాయి. పర్యాటకులు సాయంత్రం, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి.
– అడపా శివకుమార్,
సెక్షన్ ఆఫీసర్, హార్సిలీహిల్స్
Comments
Please login to add a commentAdd a comment