ఎట్టకేలకు కురబలకోట మండల మీట్
కురబలకోట : కురబలకోట మండల మీట్ ఎట్టకేలకు శుక్రవారం జరిగింది. మూడు సార్లు వాయిదా పడిన తర్వాత నాలుగో సారి ఉత్కంఠ మధ్య జరిగింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా ముగియడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో మెజారిటీగా 11 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండల మీట్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గతేడాది జూలై 12న మండల మీట్ జరగాల్సి ఉండగా.. కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో వాయిదా పడింది. మళ్లీ అదే నెల 19న మండల మీట్‌కు కోరం సభ్యులు హాజరైనా కోరం లేదని వాయిదా వేశారు. అయితే మెజారిటీ సభ్యులతో కోరం ఉండటం, ఆపై రిజిస్టర్‌లో సభ్యులు సంతకాలు కూడా చేసి ఉండటంతో కోరం ఉన్నట్లు ఆ తర్వాత నిర్ధారించి నివేదికలు పంపారు. తిరిగి అక్టోబరు 18న మండల మీట్ నిర్వహించాల్సి ఉండగా.. మళ్లీ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో కోరం లేక వాయిదా పడింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
అభివృద్ధి కోసం కలిసి సాగుదాం : ఎంపీపీ
హైకోర్టు ఆదేశాలతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల మీట్‌కు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల నుంచి 150 మందికి పైగా సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. సభ్యులు, అధికార ఉద్యోగులను మాత్రమే మండల మీట్‌కు అనుమతించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన పది మంది సభ్యులతో పాటు ఇండిపెండెంట్ సభ్యుడు వైజీ సురేంద్ర హాజరయ్యారు. సంపూర్ణ కోరం లభించింది. చింతమాకులపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ మాత్రం హాజరు కాలేదు. ఐదుగురు కూటమి నాయకులు మాత్రం ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంపీపీ బి.దస్తగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజా సంక్షేమాన్ని వివిధ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని సమావేశాలకు ఆటంకం కల్గించరాదని ఎంపీపీ బి.దస్తగిరి అన్నారు. మండల అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక కృషి చేశారన్నారు. ఊరూరా రోడ్లు వేయించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించారన్నారు. అదే విధంగా మండల ప్రగతిలో భాగంగా కూటమి నాయకులు మండల మీట్ నిర్వహణకు సహకరించడం శుభపరిణామమన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజకీయాలు చూడరాదన్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుదామన్నారు. మండల మీట్‌ఽ సజావుగా జరగడానికి సహకరించిన నాయకులు, అధికార యంత్రాంగం మరో వైపు పోలీసులతోపాటు ప్రతి ఒక్కరికీ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మండల మీట్‌లో కనసానివారిపల్ల్లె వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ముదివేటి ఆనందరెడ్డి వివిధ సమస్యలపై సభలో గళమెత్తారు. ఆ గ్రామ సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి కూడా సమస్యల పరిష్కారం కోసం సభ దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ బైసాని జ్యోతి పాల్గొన్నారు. డీఎస్పీ కొండయ్య ఆదేశాలతో రూరల్ సర్కిల్ సీఐ రమేష్ పర్యవేక్షణలో ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు.
మూడు సార్లు వాయిదా తర్వాత
విజయవంతం
హైకోర్టు ఆదేశాలతో పటిష్ట బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment