గల్లంతైన యువకుడు మృతి
గుర్రంకొండ : క్వారీ నీటి గుంతల్లో ఈత కొడుతూ.. గల్లంతైన యువ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు. మూడు రోజుల నుంచి రెస్క్యూ టీమ్ సభ్యులు గాలిస్తూ.. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటికి తీశారు. కలకడ మండలం గుడిబండ పంచాయతీ చొక్కనవారిపల్లెకు చెందిన బి.సూరి కుమారుడు బి.వెంకటరత్నం(24) లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసుకొని ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. లండన్‌లోనే ఉద్యోగం రావడంతో మరో 15 రోజుల్లో చేరడానికి సన్నాహాలు చేసుకొన్నాడు. ఈ నెల 15న సంక్రాంతి సందర్భంగా స్నేహితులతో కలసి క్రికెట్ ఆడిన తర్వాత.. ఈతకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. చుట్టుపక్కల బావులు లేకపోవడంతో గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె సమీపంలోని క్వారీ నీటి గుంతల్లోకి వచ్చారు. ఈత కొడుతూ ఉన్నట్టుండి నీటి గుంతల్లో మునిగిపోయాడు. స్నేహితులు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు రోజుల పాటు వాల్మీకిపురం, పీలేరు, రాయచోటి రెస్క్యూ టీమ్ సభ్యులతో క్వారీ గుంతల్లోని నీటిలో యువ ఇంజినీర్ కోసం గాలించారు. ఫలితం లేక పోవడంతో శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి ఎస్‌డీఎస్ టీమ్‌ను పిలిపించారు. రెస్క్యూ టీమ్ సభ్యులు ఉదయం క్వారీ నీటి గుంతల్లో తమ సామగ్రితో వెళ్లి యువ ఇంజినీర్ మృతదేహాన్ని ఎట్టకేలకూ బయటకు తీశారు. అప్పటికే క్వారీ వద్దకు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు చేరుకొన్నారు. మృతదేహం బయటకు రాగానే కుటుంబ సభ్యులు బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ మధురామచంద్రుడు వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా యువ ఇంజనీర్‌మృతితో చొక్కనవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మూడు రోజుల తరువాత మృతదేహం వెలికితీత
ఈత కోసం క్వారీ గుంతల్లోకి వెళ్లి
మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment