పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

Published Sat, Jan 18 2025 12:57 AM | Last Updated on Sat, Jan 18 2025 12:57 AM

-

మదనపల్లె : పశువులను కబేళాకు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. శుక్రవారం మదనపల్లె బైపాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా, అనంతపురం వైపు నుంచి వచ్చిన ఓ లారీని తనిఖీ చేయగా అందులో గేదెలు, ఎద్దులు రవాణా చేస్తున్నట్లు గుర్తించామని ఎస్‌ఐ పేర్కొన్నారు. తరలిస్తున్న వ్యక్తులను వివరాలు కోరితే, పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న కేరళ పాలక్కాడ్‌కు చెందిన మదన్‌కుమార్‌(38), మన్నూర్‌కు చెందిన సాల్మన్‌(54), సత్యసాయిజిల్లా నల్లచెరువుకు చెందిన లతీఫ్‌(35)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. పశువులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫారం–1 సమర్పించాలి

రాయచోటి (జగదాంబసెంటర్‌) : అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా నియమం 2010 ప్రకారం ఫారం–1 సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ పాఠశాల విద్యా డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వంచే గుర్తింపు పొందినవారు, గుర్తింపు అవసరమైన వారు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఫారం–1 తీసుకొని అందులో పొందుపరిచిన వాటి వివరాలు తెలియజేయాలని చెప్పారు.

రేపు ఏపీజీఈఏ మహాసభ

కడప రూరల్‌ : కడప నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రఘురామ నాయుడు, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో..

కడప కల్చరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య రాష్ట్ర మహాసభ ఈనెల 19న ఆదివారం నంద్యాలలో నిర్వహించనున్నట్లు జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు విజయ్‌భట్టర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సభకు ప్రతి జిల్లా నుంచి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు తప్పక హాజరవుతారని, మన జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున సభ్యులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement