రెచ్చిపోయిన అధికార పార్టీ రౌడీ మూకలు
రాయచోటి : రాయచోటిలో టీడీపీకి చెందిన రౌడీమూకల దాడులతో పట్టణ ప్రజలు భీతిల్లిపోతున్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో టీడీపీ వర్గీయుల గ్యాంగ్ దాష్టికానికి శనివారం తెల్లవారుజామున కారు దగ్ధమైంది. పట్టణ పరిధి కొత్తపల్లిలోని లాల్ మసీదు సమీపంలో నిలిపిన కారుకు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు, వారి అనుచరులు నిప్పు పెట్టారు. తెల్లవారుజామున రెండు గంటల సమీపంలో కొంతమంది గ్యాంగ్ సభ్యులు కొత్తపల్లి వీధుల్లో తిరుగుతూ.. నిలబెట్టిన బైకులను పడదోస్తూ వీరంగం సృష్టించారు. అనంతరం కొద్దిసేపటికి మసీదు సమీపంలో నిలిపిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఖాదర్ బాషా అనుచరుల వీరంగం అధికమైందని స్థానిక మైనార్టీలు వాపోతున్నారు. కారు దగ్ధం ప్రమాదం కూడా ఖాదర్ బాషా అనుచరులు సయ్యద్, డాకు అనే గ్యాంగ్ సభ్యుల కారణంగానే సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాంగ్ సభ్యులు వీధులలో వీరంగం సృష్టిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. నెల రోజుల కిందట చార్మినార్ హోటల్‌కు, పది రోజుల క్రితం కొత్తపేటలోని ఓ షాపునకు టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు నిప్పంటించి దౌర్జన్యాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటనపై అర్బన్ సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణంలో వీరంగం సృష్టిస్తూ.. కారుకు నిప్పు
వరుస సంఘటనలతో భీతిల్లుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment