జగనన్న కాలనీలో టీడీపీ దౌర్జన్యం
● జేసీబీతో పేదల ఇంటి పునాదులు ధ్వంసం
● జియోట్యాగింగ్, బిల్లులు పడినా వదలని వైనం
మదనపల్లె : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజురోజుకీ టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. అధికార బలంతో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ పేదలు, అమాయకులపై తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. మదనపల్లె మండలం సీటీఎం దళితవాడ జగనన్న కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జేసీబీని తీసుకెళ్లి.. పేదలు కష్టపడి నిర్మించుకున్న పునాదులను పెకిలించి బయటపడేశారు. తమకు గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు, జియోట్యాగింగ్ ద్వారా తమ ఖాతాలో పడిన బిల్లు మొత్తానికి సంబంధించిన రశీదులను లబ్ధిదారులు చూపించినా కూటమి నాయకుల మనస్సు కరగలేదు. తమ ప్రభుత్వంలో తాము చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించారు. అయితే ప్రభుత్వ కాలనీలో టీడీపీ వర్గీయులు ఇంత రాద్ధాంతం చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. కనీసం అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. మదనపల్లె మండలం సీటీఎం దళితవాడలో జగనన్న కాలనీ లేఔట్ కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్వే నంబర్ 354లో స్థానికులైన బోయకొండ, గెడ్డం శ్రీనివాసులు వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసింది. 54 మంది పేదలకు అందులో ఇంటి పట్టాలు మంజూరు చేసింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు పునాదులు వేసుకున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి జియో ట్యాగింగ్‌తోపాటు వారి బ్యాంకు ఖాతాలకు బిల్లులు పడ్డాయి. అయితే పునాదులు నిర్మించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉండటంతో టీడీపీ నాయకుల కన్ను వాటిపై పడింది. ఎలాగైనా వాటిని ఆక్రమించుకోవాలనే నెపంతో అవకాశం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో శనివారం ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా సీటీఎంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత...స్థానిక టీడీపీ నాయకులు పగడాల నాగేంద్ర, గౌర కృష్ణమూర్తి, గౌర రఘు, లలిత, రెడ్డినీల, మచ్చాశివ తదితరులు జేసీబీని తీసుకెళ్లి ఉన్నపళంగా నాలుగు ఇంటి పునాదులను పెకిలించారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడకు వెళ్లి కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా, కనికరించకపోగా, అధికార దర్పం ప్రదర్శించారు. దీనిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు సకాలంలో స్పందించకపోవడంతో పేదలు తమ కలల ఇంటిని కోల్పోయారు. అధికారులు స్పందించి, తమ కు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment