అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెద్దతిప్పసముద్రం : ఒక వైపు అప్పులు, మరో వైపు మద్యానికి బానిసైన సీతక జయదేవ్ (53) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు భానుప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ కాయలవాండ్లపల్లికి చెందిన జయదేవ్ తిరుపతిలో పండ్ల వ్యాపారం చేస్తుండే వాడు. కట్టుకున్న భార్యను 10 ఏళ్ల క్రితం వదిలేసి మరో వితంతు మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలాగే అప్పుల కారణంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ కోసం ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని లోలోపలే కుమిలిపోతూ పలువురికి తన గోడు చెప్పుకొన్నాడు. తనకు చావే శరణ్యం అని నిర్ధారించుకుని గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గ్రామస్తులు అడ్డుకుని అతనిలో మనోధైర్యం నింపారు. అయినా శుక్రవారం వేకువజామున కాయలవాండ్లపల్లి సమీపంలోని చింతచెట్టుకు డ్రిప్ పైపుతో గొంతుకు బిగించి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ రామాచార్లపల్లెకు చెందిన జయప్ప కుమారుడు శంకర(38) భవననిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడి భార్య లక్ష్మి, కుటుంబ సమస్యలతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పలుమార్లు కాపురానికి రావాల్సిందిగా కోరినా, ఆమె రాకపోవడంతో శంకర తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment