బీమాతో ధీమా.!
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ప్రైవేట్ పాలసీలు ఎన్ని వస్తున్నా తపాలా పాలసీలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. తక్కువ చెల్లింపులతో ఎక్కువ బోనస్ ఇస్తారనే విశ్వాసం ఉంది. తపాలా శాఖలో పలు పాలసీలు ఉన్నా ప్రజల్లో అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. జీవిత బీమా పథకం ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా దోహదపడుతోంది. 1884 ఫిబ్రవరి 1న కేవలం తపాలా శాఖలో ఉద్యోగం చేసే వారి కోసం ప్రారంభమైన పీఎల్‌ఐ(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
తపాలా బీమా పాలసీలను 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తీసుకోవచ్చు. రూ. 50 లక్షల వరకు తీసుకునే సౌకర్యం ఉంది. పాలసీలు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే సౌలభ్యం ఉంది. ప్రధానంగా ఆరు రకాల పాలసీలు అమలవుతున్నాయి. వాటిలో సంతోష్, సువిధ, సుమంగళి, యుగళ్ సురక్ష, సురక్ష బాలాజీ పాలసీలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చాలామందికి అవగాహన లేదు. దీనిపై తపాల శాఖ అధికారులు సభలు, సమావేశాలు నిర్వహించి మరింత అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
పాలసీ వివరాలు..
సంతోష్ : తపాలా శాఖ ద్వారా తీసుకున్న పాలసీల్లో అధిక శాతం మంది మొగ్గు చూపుతున్న ఎండోమెంట్ పాలసీ ఇది. క్రమంగా ప్రీమియం చెల్లించిన మూడు సంవత్సరాల తర్వాత రుణం తీసుకునే సదుపాయం ఉంది. మొత్తం టాక్స్ సేవింగ్ బెనిఫిట్ పొందవచ్చు. పాలసీ ఆమోదించిన నాటి నుంచి పూర్తి జీవిత రక్షణ ఉంటుంది.
సువిధ : హోల్‌లైఫ్ పాలసీదారులు 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సంతోష్ పాలసీలోకి మారే వెసులుబాటు కల్పించారు. తక్కువ డబ్బులు చెల్లించే వీలుతో పాటు రుణం తీసుకునే సౌకర్యం ఉంది.
సుమంగళి : మనీ బ్యాక్ పాలసీగా తపాలా శాఖ అందిస్తోంది. 15, 20 సంవత్సరాల వ్యవధిలో పాలసీని పొందవచ్చు. 15 సంవత్సరాల పాలసీలో వరుసగా 6 సంవత్సరాలు పూర్తి కాగానే కట్టిన మొత్తం నుంచి 20 శాతం, 9 సంవత్సరాల తర్వాత మరో 20 శాతం, 12 సంవత్సరాల తర్వాత మరో 20 శాతం, చివరగా 15 సంవత్సరాల తర్వాత 40 శాతం నగదుతో పాటు అదనపు బోనస్ పొందవచ్చ. దీంతో పాటు 20 సంవత్సరాల పాలసీలు 8, 12, 16, 20 సంవత్సరాలలో బోనస్ లభిస్తుంది. ప్రధానంగా మధ్య తరగతి ఉద్యోగులకు ప్రయోజనకరం.
యుగల్ సురక్ష : ఇది జాయింట్ (భార్యా భర్తలకు) పాలసీ. ఇందులో ఒకరు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. రిస్క్ కవరేజ్ మాత్రం దంపతులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ పాలసీకి సంతోష్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. ఈ పాలసీ కింద నాన్ మెడికల్ పాలసీ గరిష్టంగా రూ.5 లక్షలకు మాత్రమే తీసుకోవచ్చు.
సురక్ష : ఇది కూడా హోల్ లైఫ్ పాలసీ. 19 నుంచి 58 సంవత్సరాలు గలవారు పాలసీకి అర్హులు. రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. 4 సంవత్సరాలు చెల్లించిన తర్వాత రుణం తీసుకునే సౌలభ్యం ఉంది. మెచ్యూరిటీ మొత్తాన్ని 80 సంవత్సరాల తర్వాత పాలసీదారుడికి గానీ వారి నామినీకి గాని చెల్లిస్తారు. ప్రతి లక్ష రూపాయలకు రూ. 7600 బోనస్ పొందవచ్చు.
చిల్డ్రన్స్ పాలసీ : 5 నుంచి 20 సంవత్సరాల బాలబాలికలకు ఈ పాలసీని తపాలా శాఖ అందిస్తోంది. ప్రధానంగా పీఎల్‌ఐ పాలసీని పిల్లల తల్లిదండ్రులు నమోదు అయి ఉంటేనే ఈ చిల్డ్రన్స్ పాలసీ వర్తిస్తుంది. ఇందులో రూ.20 వేల నుంచి రూ. 30 లక్షల వరకు పాలసీ తీసుకునే సౌకర్యం కలదు.
తక్కువ బోనస్
పాలసీలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
పాలసీలు ఉపయోగకరం
తపాలాశాఖ ద్వారా అందే బీమా పాలసీలు ఎంతో ఉపయోగకరం. ఇతర బీమా సంస్థల నుంచి వచ్చే రాబడి కంటే మెరుగైన ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఉద్యోగులు పీఎల్‌ఐ పాలసీలను అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చు.పాలసీలు తీసుకుంటే కుటుంబానికి భరోసా ఉంటుంది.
– రాజేష్, తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్
ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
పీఎల్‌ఐ పాలసీని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పాలసీపై గ్రామాల్లో, నగరంలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పాలసీ తీసుకుంటే కుటుంబానికి జీవన రక్షగా ఉంటుంది. –మునాఫ్,
పీఎల్‌ఐ డెవలప్‌మెంట్ మేనేజర్, కడప డివిజన్
Comments
Please login to add a commentAdd a comment