టీడీపీ నాయకుల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు
మదనపల్లె : సీటీఎం పంచాయతీ దళితవాడ జగనన్న కాలనీలో నిర్మించుకున్న ఇంటి పునాదులను, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా జేసీబీతో కూల్చివేయడంపై బాధితులు ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు బి.శంకరమ్మ, చాగలేటి చంద్రకళ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన తమకు రెండేళ్ల క్రితం సీటీఎం పంచాయతీ జగనన్న కాలనీ సర్వే నంబర్ 354/2లో ఇంటిస్థలం పట్టా మంజూరైందన్నారు. ప్రభుత్వ అధికారులు చూపిన స్థలంలో పునాదులు నిర్మించుకున్నామన్నారు. వాటికి సంబంధించి హౌసింగ్ అధికారులు తమ బ్యాంకు ఖాతాకు రూ.70వేల మొత్తాన్ని చెల్లించారన్నారు. ఇదిలాఉండగా, సీటీఎం గొల్లపల్లెమిట్టకు చెందిన పగడాల నాగేంద్ర, గౌర కృష్ణమూర్తి, గౌర రఘు, గౌర లలిత, గౌర రెడ్డినీల, మచ్చ శివ తదితరులు శనివారం సాయంత్రం జేసీబీని తీసుకువచ్చి అగ్రకులస్థులమైన తమ ఇళ్ల మధ్యలో మీరు ఇల్లు నిర్మించుకుంటే చూస్తూ ఊరుకోమని బెదిరిస్తూ పునాదులు కూల్చివేశారన్నారు. ప్రభుత్వ అధికారులు తమకు కేటాయించిన స్థలంలోనే పునాదులు నిర్మించుకున్నామని, తమ కష్టార్జితాన్ని నేలపాలు చేయవద్దని ప్రాధేయపడినా పట్టించుకోకపోగా, దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు తప్ప తమకు వేరే ఆస్తులు లేవని, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఫిర్యాదును అందజేసి దౌర్జన్యం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment