రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
పీలేరు రూరల్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు – కలికిరి మార్గంలోని అంకాలమ్మ గుడి సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వాల్మీకిపురం మండలం గండబోయనపల్లెకు చెందిన ఆర్. రాజు (40) శనివారం ద్విచక్రవాహనంలో పీలేరుకు బయలుదేరాడు. పీలేరు పట్టణం పద్మావతి నగర్‌కు చెందిన ఎస్. హసీనా (35), ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎల్. రెడ్డెమ్మ (45) స్కూటీలో బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలోని అంకాలమ్మ గుడి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం రాజును, హసీనాను మెరుగైన వైద్య కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.
భూమి ఫెన్సింగ్, డెకరేషన్ సామగ్రి ధ్వంసం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని రింగురోడ్డుకు ఆనుకొని ఉన్న మామిళ్లపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 555లో గల తమ భూమి ఫెన్సింగ్, భూమిలోని డెకరేషన్ సామగ్రిని శనివారం తెల్లవారుజామున ధ్వంసం చేశారని చింతకొమ్మదిన్నె మండలం అంగడివీధి నివాసి మంత్రి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పగడాల సుబ్బయ్య, ప్రదీప్ మరికొందరితో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సీఐ శంకర్ నాయక్‌ను వివరణ కోరగా ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. కాగా ఈ భూమికి సంబంధించి కడప ఆర్డీఓ కోర్టులో ఒకరికి అనుకూలంగా, మరొకరికి జేసీ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చి, హైకోర్టులో సివిల్ కేసులు నడుస్తున్నట్లు తెలిసింది.
56 మద్యం బాటిళ్లు పట్టివేత
లింగాల : మండలంలోని అంబకపల్లె గ్రామంలో శివగంగిరెడ్డి ఇంట్లోని బెల్టు షాపులో మద్యం అమ్ముతుండగా దాడి చేసి 56 మద్యం బాటిళ్లను పట్టుకుని కేసు నమోదు చేశామని రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం స్థానిక లింగాల పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదనరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment