![దిన్న](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/elephantcutout_mr-1738781228-0.jpg.webp?itok=DsbVPiHR)
దిన్నెలలో.. గజ ఘీంకారం
తలకోన (శేషాచలం) అటవీ ప్రాంతం నుంచి రెండు ఏనుగులు గుంపునకు దూరంగా వచ్చేశాయి. మళ్లీ కలవడానికి ప్రయత్నించగా వాటిని మళ్లీ రానివ్వలేదు మరో ఏనుగుల గుంపు. దీంతో అవి ఆందోళనతో పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి.
రాజంపేట: తిరుపతి, అన్నమయ్య జిల్లా సరిహద్దులో ఉన్న శేషాచలం అడవుల్లో ఏనుగుల గుంపు నుంచి రెండు ఏనుగులు రాజంపేట నియోజకవర్గంలోని సానిపాయి రేంజ్ పరిధిలో దిన్నెల అటవీ ప్రాంతంవైపు వచ్చేశాయి. అవి అటవీ గ్రామాల శివార్లలో ఉన్న పంటపొలాను ధ్వంసం చేస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. రెండు రోజులుగా ఇవి భీకరంగా అరుస్తూ సంచరిస్తున్నాయి. దీంతో రైతులు గజగజ వణికిపోతున్నారు. వీటి దాడుల వల్ల నష్టపోతున్నామని వాపోతున్నారు.
ఎక్కడెక్కడా సంచరిస్తాయంటే...
ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. గతంలో రైల్వేకోడూరు అటవీ రేంజ్ పరిధిలో ఏనుగులబావి, దొంగబండ, రాజంపేట రేంజ్ పరిధిలో ఈతకాయలబండ, తుమ్మలబైలు, పింఛా అటవీ పరిసర ప్రాంతాల్లోని అంబానిబావి సమీపంలో ఇవి సంచరించాయి.దట్టమైన చెట్లతో ఉన్న శేషాచలం అడువులు కడప, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఏనుగులు ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే కాలం గడుపుతున్నాయి.
తాజాగా రాజంపేట డివిజన్ పరిధిలోని సానిపాయి రేంజ్ పరిధిలో నగిరి, శివరాంపురం, ఆరోగ్యపురం, కావలిపల్లె, ఐయ్యవారిపల్లె గ్రామాలకు సంబంధించి అటవీ శివార్లలో ఉన్న పంటపొలాలపై ఆ రెండు ఏనుగులు పడి నాశనం చేశాయి. అధికారులు కూడా నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేసే పనిలోపడ్డారు. మంగళవారం రాత్రి కూడా పంటపొలాల్లోకి వచ్చి వెళ్లినట్లు అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ రెండు ఏనుగులు మధ్య వయస్సు కలిగినవని చెబుతున్నారు. ముడుంపాడు, రాయవరం ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీసిబ్బంది హెచ్చరిస్తున్నారు.
ధ్వంసమైన పంటలివే..
రెండు ఏనుగుల బీభత్సం ఫలితంగా వరి, ఉలవ, టమోటా, అలసందలు, వేరుశెనగ పంటలు ధ్వంసం అయ్యాయి. పంటపొలాకు వేసిన కంచెను సైతం పీకి పడేశాయి. 10 నుంచి 15 సంవత్సరాలు కలిగిన టెంకాయచెట్లను వేళ్లతో సహా పెకిలించేశాయి. సాగునీటిపైపులైను ధ్వంసం చేశాయి. బాధితరైతులను ఇప్పటికే అటవీశాఖ గుర్తించింది.
బృందం నుంచి విడిపోయిన రెండు ఏనుగులు
తలకోన నుంచి దిన్నెల అడవిలోకి ప్రవేశం
పంటలను ధ్వంసం చేస్తున్న గజరాజులు
![దిన్నెలలో.. గజ ఘీంకారం1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05rjpt01a-170002_mr-1738781229-1.jpg)
దిన్నెలలో.. గజ ఘీంకారం
Comments
Please login to add a commentAdd a comment