లంకమల అధ్యయనానికి సిద్ధం
బి.కొత్తకోట: సిద్దవటం లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ధానికి చెందిన మానవ మనుగడ ఆధారాల సేకరణ, వాటిపై అధ్యయనానికి సిద్ధంగా ఉన్నామని భారతీయ పురావస్తు శాఖ (మైసూర్) డెరెక్టర్ డాక్టర్ కే.మునిరత్నంరెడ్డి వెల్లడించారు. అభయారణ్యంలో అటవీ సంపదను కాపాడే చర్యల్లో భాగంగా ఫారెస్ట్ రేంజర్ కళావతి అడవిలో సంచరిస్తున్న సమయాల్లో కనిపించిన మావన మనుగడ ఆధారాలను ఫోటోల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫోటోలను బట్టి 4 నుంచి 16వ శతాబ్దం వరకు లంకమలలో మనుషుల మనుగడ, వారి జీవనశైలి, దైవారాధన, తమ జీవన విధానాన్ని బండలపై అక్షరాలుగా చెప్పుకున్నారు. ఇదేకాక ఇంకా అధ్యయనం చేయాల్సిన, క్షేత్రస్థాయిలో పరిశీలించి కనిపెట్టాల్సిన ఎన్నో అంశాలు లంకమలలో దాగి ఉన్నాయి. వాటన్నింటిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి లంకమల గత చరిత్రను తెలియజెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు మునిరత్నంరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన బుధవారం ఇక్కడ మాట్లాడుతూ లంకమల అభయారణ్యంలో పరిశీలనలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని తమశాఖ తరపున అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినట్టు చెప్పారు. జనవరి 27న రాసిన లేఖకు ఇంకా అనుమతి ఇస్తూ సమాచారం అందలేదని అన్నారు. అనుమతి వచ్చాక తమ బృందంతో లంకమలలో పరిశోధన సాగిస్తామని చెప్పారు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఆధారాలేకాక పరిశోధనలో మరిన్ని వెలుగుచూసే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆధారాల సేకరణ తర్వాత లంకమల గత చరిత్రపై ఇంకా స్పష్టత వస్తుందని, ప్రతి శాసనాన్ని అధ్యయనం చేస్తామన్నారు.
● పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment