60 ఏళ్ల అనుబంధం
● దక్షిణ మధ్య రైల్వేతో తెగిన ఆరు దశాబ్దాల అనుబంధం
● జోన్ హద్దులపై రైల్వేబోర్డు స్పష్టత
● గుంతకల్ డివిజన్ సౌత్‌కోస్ట్ జోన్‌లోకి బదిలీ
● ఇకపై విశాఖ జోన్ కేంద్రంగానే రైల్వేపాలన
● కొత్త జోన్‌లో విలీనంౖపైరెల్వే కార్మికుల్లో అసంతృప్తి
దక్షిణ రైల్వే జోన్‌లో భాగంగా గుంతకల్లు రైల్వే డివి జన్ 1956 సంవత్సరంలో రూపొందించారు. దీనిని 1997 అక్టోబరు 2న దక్షిణ మధ్య రైల్వేజోన్‌కు బదిలీ చేశారు. ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రజలకు తన సేవలందిస్తూ వచ్చింది. ఇప్పుడు సౌత్‌కోస్ట్ జోన్‌లోకి వెళ్లిన తర్వాత సరిహద్దులు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.
ప్రస్తుత పరిధి: ఆంధ్రప్రదేశ్‌లో 120.51 రూట్ కి.మీ దూరం, కర్ణాటకలో 142.2 రూట్ కి.మీ దూరం పరిధి, తమిళనాడులో 6.86 కి.మీ మొత్తం దూరం పరిధి ఉంది. గుంతకల్లు జంక్షన్, రేణిగుంట జంక్షన్, కడప, అనంతపురం, యాదగిరి, రాయచూరు, చిత్తూరు, ధర్మవరం, గుత్తి, పాకాల, నందలూరు, డోన్, ఆందోని, మంత్రాలయం, శ్రీకాళహస్తి, కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, కోడూరు, నారాయణపేటరోడ్, వెంకటగిరి, కృష్ణా, నల్వార్‌లతోపాటు 90 స్టేషన్లు ఉన్నాయి. విశాఖజోన్ కేంద్రంగా రైల్వేపాలన జరగనుంది. ప్రస్తుత అధికార పరిధిలో కూడా మార్పులు జరగనున్నాయి.
రాజంపేట: ఆరు దశాబ్దాల తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే(సౌత్ సెంట్రల్ రైల్వే) జోన్‌తో రాయలసీమ సీమ రైల్వేలకు కేంద్రంగా ఉన్న గుంతకల్ రైల్వే డివిజన్ బంధం తెగిపోనుంది. ముంబయి–చైన్నె ప్రధాన రైలు మార్గం కడప, అన్నమయ్య జిల్లాల మీదుగా వెళుతోంది. సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో సరిహద్దులపై రైల్వేబోర్డు స్పష్టత ఇచ్చేసింది. ఇందులో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ విశాఖ కేంద్రంగా పనిచేసే సౌత్ కోస్ట్ రైల్వేజోన్‌లోకి గుంతకల్ డివిజన్‌ను విలీనం చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. కాగా ప్రస్తుతం గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూరు నుంచి వాడి (వాడి మినహా) రైల్వేసెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లోకి మార్చే అవకాశాలు ఉన్నాయి.
విశాఖ జోన్‌లోకి బదిలీపై వ్యతిరేకత
విశాఖ జోన్‌లో గుంతకల్ డివిజన్ విలీనంపై కార్మికుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డివిజన్ కేంద్రం నుంచి సౌత్‌కోస్ట్ జోన్ కేంద్రమైన విశాఖకు వెళ్లాలంటే 700 కిలోమీటర్ల ప్రయా ణం చేయాల్సి ఉంటుంది. జోన్‌కు వెళ్లి రావాలంటే కనీసం ఐదు రోజులు పడుతుంది. ప్రస్తుత జోన్ కేంద్రానికి వెళ్లాలంటే 200 కిలోమీటర్ల దూరం ఉంది. విశాఖ జోన్ వద్దు..సికింద్రాబాద్ జోన్ ముద్దు అంటూ కార్మికులు నినదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment