వలంటీర్ వ్యవస్థ లేదనటం దుర్మార్గం
బాపట్లటౌన్ : అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలి సమావేశాల్లో వలంటీర్ల వ్యవస్థ లేదనటం దుర్మార్గమని శాసనసభ మాజీ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. బాపట్లలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు వలంటీర్లకు ఎన్నో ఆశలు పుట్టించి రూ.5 వేలు కాదు..రూ. 10 వేలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం వారి గురించి ఇటు అసెంబ్లీ, అటు శాసనమండలిలో ప్రస్తావించకుండా అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. మేము వలంటీర్ వ్యవస్థను రద్దు చేశామని ధైర్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూటమి తరపున వలంటీర్లను కొనసాగిస్తామని వాగ్దానం చేశారని గుర్తుచేశారు. వలంటీర్లను రద్దుచేయాల్సి వచ్చినప్పుడు కోవిడ్ సమయంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకొని ఉంటే బాగుండేదన్నారు.
రాష్ట్రంలో ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను గత ప్రభుత్వం తీసుకువస్తే దాన్ని తృణప్రాయంగా రద్దుచేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని నేరుగా ముంగిటకే పంపిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వారికున్న మీడియాను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. వలంటీరు వ్యవస్థను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
టూరిజం అభివృద్ధి చెందాలంటే హేచరీలు తొలగించాలి
బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ అసెంబ్లీలో టూరిజం అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించడం హర్షనీయం. తీరంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే దానికి అడ్డంకిగా ఉన్న హేచరీస్‌ను ఆ ప్రాంతం నుంచి తొలగించాలన్నారు. ఆహ్లాదకరంగా ఉండే 13 కి.మీ తీరం హేచరీల కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందన్నారు. బాపట్లకే తలమానికమైన మెడికల్ కళాశాల ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుంటే దానిపై అసెంబ్లీలో మాట్లాడకపోవడం దురదుష్టకరమన్నారు. ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే విషయం గుర్తెరిగి వాటిపై అసెంబ్లీలో చర్చిస్తే బాగుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ చిన్నపోతలు హరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోగి రాజా తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ మాజీ ఉపసభాపతి
కోన రఘుపతి
Comments
Please login to add a commentAdd a comment