అట్టహాసంగా రాష్ట్రస్థాయి లాక్రోస్ పోటీలు
చీరాల: విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రావీణ్యాన్ని సాధించాలని తద్వారా మానసిక, శారీరక దృడత్వం సాధ్యమని బాపట్ల జిల్లా ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. చీరాల–కారంచేడు రోడ్డులోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో రెండు రోజులు పాటు జరగనున్న రాష్ట్రస్థాయి లాక్రోస్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ లాక్రోస్ గేమ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లాక్రోస్‌లాంటి క్రీడలు ఆడటం ద్వారా క్రీడల్లో ఏ విధంగా అయితే గెలుపు ఓటములు ఉంటాయో, అదే తరహాలో జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, ఒత్తిడిని విద్యార్థులు సమర్థవంతంగా ఎదుర్కొంటారన్నారు. స్కూల్ కరస్పాండెంట్, లాక్రోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ ఒలంపిక్ అర్హత సాధించిన లాక్రోస్ గేమ్‌ను చీరాలలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల నుంచి 175 మంది క్రీడాకారులు, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో కలిపి 22 జట్లు శనివారం పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలలో ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పోటీలను లాక్రోస్ గేమ్ ఏపీ క్రీడాభారతి వైస్ ప్రెసిడెంట్ టి.జ్యోత్స్న తదితరులు పర్యవేక్షించారు.
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలపై పోలీసుల ఓవర్ యాక్షన్
తాడికొండ: వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తాడికొండలో ఏర్పాటు చేసిన మైకులను తొలగించాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. కార్యకర్తలు, నాయకులు చిన్నపాటి మైకులు ఏర్పాటు చేసి శనివారం వేడుకులు నిర్వహించుకుంటున్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ ఆంక్షల పేరుతో పోలీసులు ఆ మైకులు తొలగించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ జన్మదిన వేడుకల విషయంలో పోలీసులు వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment