సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్
చినగంజాం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాక.. ప్రజలతో చేరువయ్యేందుకే పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ అన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు మండలంలోని సోపిరాలలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు ఎస్పీ పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే తేలికగా గుర్తించవచ్చని, అటువంటి వ్యక్తులపై అనుమానం కలిగితే స్థానికంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సీసీ కెమెరాల వలన ప్రయోజనాలున్నాయని, ప్రజలు వారి గృహాలకు, వ్యాపార సముదాయాలకు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీసు అధికారులకు గాని లేదా డయల్ 112కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆయనతోపాటు ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ శీలం రమేష్, పోలీస్ సిబ్బంది, స్థానికులు టీఎస్సార్ ఆంజనేయులు, కుర్రి రామసుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment