తెరచుకున్న పురాతన రామాలయం
చినగంజాం: భద్రాద్రి రాముడు ఆదేశించిన విధంగానే 100 ఏళ్ల ఆలయానికి మోక్షం లభించింది. ఆదివారం చినగంజాంలోని పురాతన రామాలయం ముఖద్వారం ఎట్టకేలకు వేద మంత్రాల నడుమ తెరుచుకుంది. గ్రామంలో అశుభాలు జరగడంతో పురాతన ఆలయాన్ని కాలగమనంలో మూసివేశారు. గ్రామంలోని భక్తులు సీతారామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ద్వార బంధనాన్ని తెరిపించే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆగమ శాస్త్ర పండితులు అగ్నిహోత్రం వెంకట శేషాచార్యులు, ఆయన శిష్యుడు పొన్నపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం విష్వక్సేరాధన, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పంచగవ్యారాధన, ప్రోక్షణ, అగ్నిప్రతిష్టాపనం, పూర్ణాహం, కూష్మాండ బలి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోమాతను ముందుగా ఆలయ ముఖద్వారం వద్దకు తీసుకొని వచ్చి ద్వార బంధనం తెరపించారు.
విగ్రహాలను దర్శించుకున్న భక్తులు
ఆలయ ముఖ ద్వారం తెరచిన వెంటనే ఎన్నో సంవత్సరాల నుంచి బంధించబడి ఉన్న సీతారామస్వామి, లక్ష్మణుడు, దాసాంజనేయస్వామి అద్భుత రాతి విగ్రహాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కనులారా దర్శించుకున్నారు. ఆలయంలో వాటితోపాటు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టించి ఉండటాన్ని కనుగొన్నారు. భద్రాచలం సీతారాముల మాదిరిగా ఉన్న రాతి విగ్రహాలను ఆలయం బయటకు తీసుకొని వచ్చి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి శుద్ధి చేశారు. భక్తులు విశేషంగా విగ్రహాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భావన్నారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలోకి తరలించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వలివేటి వెంకట రామానుజం, మోటుమర్రి రామసుబ్బారావు, తొగరు శ్రీనివాసరావు, వలివేటి మురళీకృష్ణ, వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
100 ఏళ్ల తర్వాత గుడికి మోక్షం వేద మంత్రాల నడుమ ద్వార బంధనం తెరచిన భక్తులు భద్రాచల రాముని భంగిమలో బయల్పడిన సీతారామ రాతి విగ్రహాలు
Comments
Please login to add a commentAdd a comment