అత్తామామలపై అల్లుడు దాడి
వినుకొండ(నూజెండ్ల): భార్యను కాపురానికి పంపలేదని అత్తామామలపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన వినుకొండ రూరల్ మండలం తిమ్మాయపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బండారు శివయ్య, రమణల కుమార్తె అయిన లక్ష్మిని ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి ఇచ్చి 12 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు సంతానం. నిత్యం మద్యం తాగి భార్యను హింసిస్తుండటంతో ఏడాది క్రితం లక్ష్మి తిమ్మాయపాలెం గ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో అత్తామామలపై కక్షపెంచుకున్న అల్లుడు రాములు మద్యం తాగి భార్య తన వద్దకు రాకపోవడానికి మీరే కారణమంటూ కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో శివయ్యకు తీవ్రగాయాలు కాగా అత్త రమణకు చేయి విరిగింది. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment