కూటమి ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరల
చీరాల: ధరలు పెరిగినా మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతుండటంతో అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 1888 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 27,462 మంది ఉన్నారు. కేంద్రాల్లో వీరికి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉంది. ప్రభుత్వం బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, పాలు మాత్రమే అందిస్తోంది. అదీ కూడా ఒక్కో చిన్నారికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె మాత్రమే ఇస్తోంది. చిన్నారుల సంఖ్యను బట్టి ఆయా సరుకులు పంపిణీ చేస్తారు. ప్రతినెలా కందిపప్పు, బియ్యం రేషన్ దుకాణాల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. కూరగాయలకు రూ.800, గ్యాస్ సిలిండర్‌కు రూ.400 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
కేంద్రాలపై పెను భారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలుగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలు చేయడం కష్టంగా మారింది. కూరగాయలు కొనుగోలు అంగన్‌వాడీలకు తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న రూ.800 సరిపోవడం లేదు. ఫలితంగా అప్పులు చేసి మరీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన దుస్థితి నెలకొంది. వాపోతున్నారు. పప్పు, పులిహోర వంటి వాటిల్లో పోపు దినుసులను సైతం కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రభుత్వం అదనంగా ఏమీ ఇవ్వడం లేదు. వంట గ్యాస్ నిమిత్తం ప్రభుత్వం ప్రతి నెలా కేంద్రాలకు ఇవ్వాల్సిన రూ.400 కూడా చెల్లించడం లేదు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులు వచ్చే అంగన్‌వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచాలి. సబ్బులు, చీపుర్లు, చాపలు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రభుత్వం నగదు అందించక పోవడంతో అంగన్‌వాడీలకు చేతి చమురు వదులుతోంది. పెరుగుతున్న గ్యాస్, కూరగాయలు, నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోడంతో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కేంద్రాల్ని నడుపుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీ మెనూ..
సోమవారం దోసకాయ పప్పు
మంగళవారం పులిహోర, టమాటా పప్పు
బుధవారం ఆకుకూర పప్పు
గురువారం కూరగాయలతో సాంబారు
శుక్రవారం కూరగాయల పప్పు
శనివారం వెజిటబుల్ రైస్, ఆకుకూర, సాంబారు
ఉన్నతాధికారులకు నివేదించాం
పెరిగిన ధరలకు అనుగుణంగా కూరగాయలు, ఇతర అవసరాలకు తమకు అందిస్తున్న నగదును పెంచాలనే విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు గతంలోనే మా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించాం.
– ఉమ, ఐసీడీఎస్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment