మహిళల జీవనోపాధి పెరుగుదలకు చర్యలు
కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: మహిళల జీవనోపాధి పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జీవనోపాధి పథకం అనుసంధానంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సమర్థంగా చేపట్టాలన్నారు. వారి జీవనోపాధివృద్ధికి అధికారులు సహకరించాలని తెలిపారు. పాడి గేదెల పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మండలాల వారీగా లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం గేదెల కొనుగోలు ప్రక్రియ పక్కాగా చేపట్టాలని చెప్పారు. యువతీ, యువకుల ఉద్యోగ నియామకాలకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బాపట్ల జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించి నివేదిక పంపాలని డీపీఓను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే రెవెన్యూ అంశాల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, డీఆర్‌డీఏ పీడీ పద్మ, డీపీఓ ప్రభాకర్, మత్స్యశాఖ ఇన్‌చార్జ్ ఏడీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment