వాహనం ఢీకొని యువకుడు మృతి
అద్దంకి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకు మీద వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అద్దంకి మండలంలోని చక్రాయపాలెంలో చోటుచేసుకుంది. సీఐ ఏ.సుబ్బరాజు వివరాల మేరకు.. మండలంలోని చినకొత్తపల్లి గ్రామానికి చెందిన మాగంటి గోవర్ధన్ (30) ద్విచక్రవాహనంపై అద్దంకి వైపు వస్తున్నాడు. ఈక్రమంలో అద్దంకి నార్కెట్‌పల్లి నామ్ రహదారిపై మండలంలోని చక్రాయపాలెం గ్రామం రాగానే రహదారిపై వెనుకగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
యార్డులో 47,441 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 40,178 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 47,441 బస్తాలు అమ్మకాలు నిర్వహించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,200 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.15,500 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,500 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.7,500 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 41,052 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు.
20న నల్లపాడులో జాబ్‌మేళా
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో 20వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బిటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విభాగాల వరకు చదువుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్స్, 18–35 సంవత్సరాల వయసు ఉన్న నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు పాస్‌పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment