రైతు సమస్యలు పరిష్కారం చేయాలి
కారంచేడు: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి (167–ఏ) నిర్మాణ పనుల్లో రైతులకు, స్థానిక ప్రజలకు అభ్యంతరకరంగా మారిన సమస్యలను పరిష్కరించేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె విజయవాడలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎన్‌హెచ్ అథారిటీ ఆర్‌ఓ రాజేష్‌కుమార్‌సింగ్, సంజీవ్‌నాయుడులతో ఆమె చర్చించారు. కారంచేడు, పర్చూరు మండలాలకు చెందిన సుమారు 19 గ్రామాల ప్రజల సౌకర్యార్థం నిర్మాణ పనుల్లో కొంత సరళించాలని ఆమె సూచించారు. వీటిలో ప్రధానంగా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామం వద్ద అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. దీనికి తోడు కారంచేడు మండలంలోని కారంచేడు, కుంకలమర్రు ప్రాంత రైతన్నల సమస్యలను పరిష్కరించేలా అవసరమైన అండర్‌పాస్‌లను కూడా మంజూరు చేయాలని ఆమె సూచించారు. గ్రామానికి వచ్చిన పురందేశ్వరిని పై గ్రామాల ప్రజలు, రైతులు కలసి వినతిపత్రం అందించారు. అంతకుముందు బుధవారం కొంత మంది రైతులు తమకు న్యాయం చేయాలని, అంత వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని రోడ్డుపై బైఠాయించి, టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో దిగివచ్చిన సంబంధిత నేషనల్ హైవే అథారిటీ అధికారులు కొంత మార్పులు చేయడానికి అంగీకరించినట్లు సమచారం. వీటిలో ఉప్పుటూరు వద్ద ఒక అండర్‌పాస్ నిర్మాణం, కారంచేడు పొలాల వద్ద రైతులకు సాగునీరు ప్రవహించేలా అవసరమైన రెండు అండర్ పాస్‌ల నిర్మాణానికి ఒప్పుకున్నట్లు సమాచారం. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన సుమారు 120 మంది రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారాలను త్వరగా ఇవ్వాలని పురందేశ్వరి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పర్చూరు ప్రాంత రైతులు, అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్ అధికారులతో పురందేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment