వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన ప్రేమ్‌సాగర్
● తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ కై వసం ● వెల్లువెత్తుతున్న అభినందనలు
చీరాల రూరల్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్‌సాగర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నాడు. ఈనెల 15 నుంచి 18 వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆలిండియా యూనివర్సిటీస్ చాంపియన్‌షిప్ పోటీలు 2025 నిర్వహిస్తున్నారు. పోటీల్లో చీరాల సాయికాలనీకి చెందిన ప్రస్తుతం వైఎస్సార్ కడప యోగి వేమన యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న దేవరకొండ ప్రేమ్‌సాగర్ 81 కిలోల విభాగంలో పాల్గొన్నాడు. స్నాచ్‌లో 140 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 166 కిలోలు ఎత్తాడు. ఓవరాల్‌గా 306 కిలోల బరువులతో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో దేశంలోని 40 యూనివర్సిటీలకు చెందిన 200 మంది లిఫ్టర్లు పాల్గొనగా 81 కిలోల విభాగంగా మన రాష్ట్రం నుంచి ప్రేమ్‌సాగర్ ఒక్కడే పాల్గొనడం విశేషం.
అభినందనలు..
ఎంతో పట్టుదలతో కృషిచేసి తృతియ స్థానం సాధించి మన రాష్ట్రంతో పాటు చీరాలకు పేరు ప్రతిష్టలు అందించాడు. ఆల్ ఇండియా స్థాయిలో పతకం సాధించిన తనను ఇంతగా ప్రోత్సహిస్తున్న వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరి, కోచ్ టి.దీన్షాబాబు, వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకట రామయ్య, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొవ్వూరు రామసుబ్బారెడ్డికి స్పాన్సర్ షిప్ అందిస్తున్న రాధే గ్రూప్ చైర్మన్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, మేనేజింగ్ డైరెక్టర్ రాధేలకు పతక విజేత ప్రేమ్‌సాగర్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేమ్‌సాగర్ గతంలో అనేక పోటీలలో పాల్గొని పతకాలు సాధించాడు. పతకం సాధించిన ప్రేమ్‌సాగర్‌కు క్రీడాభిమానులతోపాటు అసోసియేషన్ పెద్దలు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment