భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్‌కె.సైదులు అన్నారు. గురువారం పట్టణంలోని భవిత కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రతివారం జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ శిబిరాన్ని దివ్యాంగ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 23 మండలాల్లోని 30 భవిత కేంద్రాల్లో పని చేస్తున్న 36 మంది సమ్మిళిత విద్యా రిసోర్స్‌పర్సన్‌లు, 21 రకాల వైకల్యాలు కలిగిన పిల్లలందరికీ తగిన శిక్షణను ఇస్తున్నారని తెలిపారు. దివ్యాంగ పిల్లల్లో సామర్థ్యాలను పెంచేందుకు భవిత కేంద్రాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. భవిత కేంద్రాల్లో ఇచ్చే శిక్షణతో మెరుగుపడిన దివ్యాంగ పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్పిస్తారని అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రైటర్ బస్తీలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలని, నాణ్యత కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులకు, ఇంప్లీమెంటింగ్ ఏజెన్సీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్, సమ్మిళిత విద్యా ఉపాధ్యాయురాలు దుర్గ, మాధవి, సమ్మిళిత విద్యా రిసోర్స్‌పర్సన్లు శ్రీరామ్, అరుణ కుమారి, ఫిజియోథెరపిస్ట్ వసీంఅహ్మద్ , తల్లిదండ్రులు, దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment