కొలిక్కిరాని ఫుడ్‌కోర్టులు..!
● ఏళ్ల తరబడిగా నిరుపయోగంగా షెడ్లు ● వీధి వ్యాపారులకు కేటాయించాలని పలువురి విన్నపం
కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని గాజులరాజం బస్తీలో జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆనుకుని నిర్మించిన షెడ్లను ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఏళ్ల తరబడిగా ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారని అధికారులను ప్రశ్నించారు. షెడ్లలో మహిళా సంఘాలతో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఇప్పటివరకు రెండుసార్లు పరిశీలించి అధికారులను ఆదేశించినా ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయలేదు. అయితే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే అందులో వంటకాలు చేసే అవకాశం ఉండదు. వేరే చోట తయారు చేసి, తీసుకొచ్చి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో తినుబండరాలు వేడి వేడిగా ఉండవని, విని యోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపరని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనికితోడు నిర్వాహకులపై రవాణా భారం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా ఫుడ్ కోర్టులకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. కాగా దరఖాస్తులు వస్తే ఏర్పాటుకు చర్యలు చేపడతామని మెప్మా సిబ్బంది చెబుతున్నారు.
వీధి వ్యాపారులకు కేటాయిస్తే..
గాజులరాజంబస్తీలో జిల్లా ప్రధాన ఆస్పత్రి గోడకు ఆనుకుని ఆరేళ్ల క్రితం చిరువ్యాపారుల కోసం రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో 15 రేకుల షెడ్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు వీధివ్యాపారులకు కేటాయించలేదు. మరోవైపు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా నుంచి బూడిదగడ్డ, హనుమాన్‌బస్తీ, గాజులరాజంబస్తీ ప్రజలంతా కూడా నిత్యావసరాలు, కూరగాయల కోసం సూపర్‌బజార్‌లోని రైతుబజార్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడిగా నిరూపయోగంగా ఉన్న షెడ్ల దగ్గర ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయకపోతే వీధి వ్యాపారులకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలకు అన్ని రకాల వస్తువులు, కూరగాయలు కూడా అందుబాటులో దొరికే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు చేపడుతున్నాం..
గాజులరాజంబస్తీలో నిర్మించిన షెడ్లలో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాటుకు మెప్మా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేస్తాం.
– శేషాంజన్‌స్వామి,
కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment