విద్యా సామర్థ్యాలు మెరుగుపరచాలి
బూర్గంపాడు/గుండాల/ఇల్లెందురూరల్ : గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేపట్టాలన్నారు. ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంచేందుకే ఉద్దీపకం వర్క్‌బుక్ విడుదల చేశామని చెప్పారు. బుధవారం ఆయన బూర్గంపాడు మండలం వేపలగడ్డ, ఇల్లెందు మండలం రొంపేడు, గుండాల మండలం కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యాసన తీరును పరిశీలించారు. పిల్లలతో పాఠ్యాంశాలు చదివించి, బోర్డుపై రాయించారు. వర్క్‌బుక్‌లోని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు, భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఉద్దీపనం వర్క్‌బుక్‌లోని పలు అంశాలను విద్యార్థులకు బోధించిన ఆయన కఠినమైన అంశాలను సులభంగా ఎలా నేర్చుకోవచ్చో అవగాహన కల్పించారు. ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల్లో సామర్థ్యాల పెంపునకు ఈ వర్క్‌బుక్ ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులకు అర్థం కాని అంశాలను మరోసారి బోదించి ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాదులు వేయాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను చదివించడంతో పాటు రాయించాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ డీడీ మణెమ్మ, ఏటీడీఓ రాధమ్మ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భద్రు, సుభద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment