సమ్మెతో స్తంభించిన బోధన..
● ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల ఆందోళనతో కేజీబీవీ విద్యార్థుల ఇక్కట్లు ● విద్యాశాఖలోనూ నిలుస్తున్న పలు రకాల పనులు ● ఆగిన ఆధార్ అప్‌డేట్, ఆన్‌లైన్ హాజరు నమోదు ప్రక్రియ
కొత్తగూడెంఅర్బన్ : తమను రెగ్యులర్ చేయాలంటూ జిల్లాలోని 650 మంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అంతకుముందు నాలుగు రోజుల పాటు రోజుకు కొందరు చొప్పున నిరసన దీక్ష చేశారు. ఉద్యోగుల సమ్మెతో విద్యాశాఖలో పనులు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా కేజీబీవీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది విధులు బహిష్కరించడంతో ఆయా విద్యాలయాల్లో తరగతుల నిర్వహణ ఆగిపోయింది. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రస్తుత సమయం ఎంతో కీలకం. కొన్ని సబ్జెక్టుల సిలబస్ చివరి దశలో ఉండగా, మరి కొన్ని సబ్జెక్టులు ఇంకా చాలావరకు మిగిలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సిన ఈ తరుణంలో ఉపాధ్యాయుల సమ్మెతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమో లేదంటే వారి స్థానంలో ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను కేజీబీవీలకు రప్పించడమో చేయాలని కోరుతున్నారు.
ఆగిన ఆధార్ అప్‌డేట్..
ప్రస్తుతం పలు పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో హాజరు నమోదు, ఆధార్ అప్‌డేట్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు యూనిక్ ఐడీ జనరేట్ పనులు కూడా నడుస్తున్నాయి. ఈ పనులన్నీ సమగ్ర శిక్ష ఉద్యోగులే చేయాల్సి ఉండగా, సమ్మెతో స్తంభించిపోతున్నాయి. జిల్లా విద్యాశాఖలో ఏపీఓలుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, సాంకేతిక ఉద్యోగులుగా, మేనేజర్లుగా, మండల స్థాయిలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీలుగా, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా, పాఠశాల స్థాయిలో పీఈటీలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో ప్రత్యేకాధికారులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్నారు. సమ్మెతో వీరంతా చేయాల్సిన పనులు నిలిచిపోతున్నాయి. ఇంకా ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, వంట మనుషులు, వాచ్‌మెన్స్, స్వీపర్లుగా కూడా దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారిని నేటికీ క్రమబద్ధీకరించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఉద్యోగుల సమ్మెకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఇతర యూనియన్లు మద్దతు ప్రకటించాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే..
● కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు బేసిక్ పే ఇవ్వాలి
● ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలి
● పీటీఏలకు ఎస్‌ఎస్‌ఏల వలే 12 నెలల వేతనం ఇవ్వాలి
● ఎస్‌ఎస్‌ఏలు ఉద్యోగ విరమణ చేస్తే బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు చెల్లించాలి
సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమం
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమిస్తాం. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలి. మా సమ్మెతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్నా.. తప్పని పరిస్థితుల్లో మేం ఆందోళన చేయాల్సి వస్తోంది.
– భూక్యా మోహన్,
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
విద్యార్థుల భోజనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం
సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో కేజీబీవీల్లో బోధనకు సమస్యలు తలెత్తున్నాయి. అయితే విద్యార్థుల భోజనానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు ఆధార్ అప్‌డేట్, విద్యార్ధుల యూనిక్ ఐడీ ఎంట్రి ప్రక్రియలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment