రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం వైభవంగా స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం పది గంటలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగేసమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలా గే, మధ్యాహ్నం 3.30 గంటలకు గాంధీచౌక్‌లోని నర్తకి థియేటర్ రోడ్డులో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి, 4గంటలకు రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో మూడో రైల్వే లైన్ భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అలాగే, శుక్రవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట మండలం అలీపురంలో గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. ఇక శనివారం ఉదయం 10 గంటలకు అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొననున్నారు.
నేడు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ
ఖమ్మం సహకారనగర్: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం విచారణ చేపట్టనుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ ఆధ్వర్యాన విచారణ చేయనున్నారని వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు వర్గీకరణపై వినతులు అందించవచ్చని తెలిపారు.
వైభవంగా
మహా చండీయాగం
తల్లాడ: లోక కళ్యాణార్థం గ్రామస్తులంతా ఏకమై నిర్వహించిన మహా చండీయాగం వైభవంగా ముగిసింది. తల్లాడ మండలం నారాయణపురంలో 70 హోమ గుండాలు ఏర్పాటుచేసి 90 మంది బ్రాహ్మణుల సమక్షాన కంచెల సతీష్‌శర్మ, పెనుగంచిప్రోలుకు చెందిన రాజోలు భానురవికిరణ్‌శర్మ బుధవారం ఈ యాగం జరిపించారు. తెల్లవారుజామున గణపతి పూజతో మొదలైన యాగంలో 207 మంది దంపతులు కూర్చున్నారు. ఇందులో 200 క్వింటాళ్ల పాయసం, వివిధ రకాల పూజాసామగ్రిని ఉపయోగించారు. హోమశాలను అరటి ఆకులు, బంతిపూలతో అలంకరించగా ప్రతీ ఇంటికి బంధుమిత్రులు రావడమే కాక నారాయణపురం, తల్లాడ పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో నారాయణపురం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment