గిరిజన విద్యార్థులకు బంగారు భవిష్యత్
● ఉపాధ్యాయుల లక్ష్యం ఇదే కావాలి.. ● పలు పాఠశాలల్లో తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ రాహుల్
కారేపల్లి: గిరిజన విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే పాఠశాలల ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ సూచించారు. కారేపల్లి మండలంలోని గాంధీనగర్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను పీఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించిన ఆయన వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై శ్రద్ధ కనబర్చాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. అలాగే, ఆహారంలో నాణ్యత లోపించకుండా మెనూ అమలు చేయాలని, సామగ్రి సేకరణ, నిల్వ సమయాన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల్లో రోజుకు ఇద్దరు చొప్పున భోజనం తిన్నాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. అనంతరం భల్లునగర్ గిరిజన పాఠశాలను సందర్శించిన పీఓ అక్కడ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఐటీడీఏ అందించిన ఉద్దీపకం వర్క్ బుక్స్ ద్వారా బోధన చేపట్టాలని సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, గురుకులాల ఆర్‌సీఓ నాగార్జునరావు, ప్రిన్సిపాల్ హరికృష్ణ, డిప్యూటీ వార్డెన్ పాషా, అధ్యాపకుడు గామయ్య పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, లేదా అని ఆరా తీశారు. అలాగే, విద్యార్థులతో ఉద్దీపకం పుస్తకాలను చదివించి సామర్థ్యాలను పరీక్షించారు. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తిచేసి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి పీఓ మధ్యాహ్న భోజనం చేశారు. ఏటీడీఓలు జహీరుద్దీన్, సత్యవతి, ఏసీఎంఓ రాములు, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, హెచ్‌డబ్ల్యూఓ రమాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. తిరుమ లాయపాలెం మండలంలోని మాదిరిపురం గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీ, ఆరో తరగతి విద్యార్థులతో మాట్లా డి వారికి అందిస్తున్న ఆహారం, బోధనపై ఆరాతీశారు. అలాగే, వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అనంతరం వంట తయారీ గదిని పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ భాస్కర్, వైస్ ప్రిన్సిపాళ్లు జాను, అనిత, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్, ఇన్‌చార్జ్ వార్డెన్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment