గుర్తు తెలియని వ్యక్తి మృతి
టేకులపల్లి: మండలంలోని గంగారం పంచాయతీ సిద్ధారం నటరాజ ఆలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45) బుధవారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసే వ్యక్తిలా ఉన్నాడని బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. నలుపు, తెలుపు రంగు జుత్తు కలిగి ఉన్నాడని, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 87126 82077 నంబరులో సంప్రదించాలని కోరారు.
చెరువులో పడి వ్యక్తి ..
వేంసూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఓ వ్యక్తి మృతి చెందగా బుధవారం మృతదేహం బయటపడింది. మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన యమవరపు మారేశ్వరరావు (46) మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్థానిక చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. స్థానికులు గాలించగా బుధవారం ఉదయం మృతదేహం బయటపడటంతో పోలీసులకు కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు..
నేలకొండపల్లి: పురుగులమందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని కోనాయిగూడెంనకు చెందిన కొలికపొంగు నాగరాజు (22) గత నెల 22న పురుగులమందు తాగగా కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు.
పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితులు?
నేలకొండపల్లి: మండల కేంద్రానికి చెందిన దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గత నెల 27న దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు సవాల్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా సీసీ పుటేజీలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. అయితే, గురువారం లేదా శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలను జిల్లా అధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment