ఇదేం సహకారమో!?
కొను‘గోల్‌మాల్’..
జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా.. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 20 మండలాల పరిధిలో 160 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ వ్యవసాయ మార్కెట్లకు అనుబంధంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. పట్టదారు పాసు పుస్తకాలు చూపించి ఇక్కడ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. అయితే రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో అమ్మడం ద్వారా మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ కూడా ప్రైవేటు వ్యాపారులకే దక్కుతోంది. వ్యవసాయ శాఖ జారీ చేసే ఎన్‌డీఎస్ (నాన్ డిజిటల్ సైన్) కూపన్లను దుర్వినియోగం చేస్తూ వ్యాపారులు, దళారులు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే భారీగా సేకరించే ధాన్యం మొత్తాన్ని కూపన్ల ద్వారానే అమ్మడం సాధ్యం కాదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పని చేసే కొందరు సిబ్బంది సహకారంతో తమ పని కానిచ్చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వాట్సాప్ స్టేటస్‌లు, చాయ్ పే చర్చల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పడానికి అందరూ ముందుకొస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అండగా నిలిచేవారు కరువైపోతున్నారు. చివరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించే ప్రాథమిక సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
దళారులకే ఎక్కువ..
జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల ఎకరాల భూమి సాగవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు 1.77 లక్షల మంది ఉన్నారు. ఇందులో కేవలం రెండెకరాల లోపు భూమి కలిగిన రైతులు 56 వేల మందికి పైగా ఉండగా, రెండు నుంచి ఐదెకరాలు కలిగిన వారు 70 వేలకు అటు ఇటుగా ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి మొదలు ధాన్యం అమ్మేవరకు ప్రతీ చోట ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. పెట్టుబడి సాయం పేరిట ముందుగానే ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లో వాలిపోయి వీరిని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ రైతులతో పాటు అప్పు తీసుకోకుండా సాగు చేసిన రైతులకు సైతం ధాన్యం కోయడం నుంచి అమ్మడం వరకు అదనపు ఖర్చులు అవుతుండడంతో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులు, దళారులకే పంట అమ్మేసుకుంటున్నారు. ఫలితంగా బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధర కూడా దక్కించుకోలేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు రైతులు కష్టించి పండించిన ధాన్యం కారుచౌకగా ప్రైవేటు వ్యాపారుల పరం అవుతోంది.
సర్దుబాటు దందా..
ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక ఎకరానికి 28 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయొచ్చు. నేల స్వభావం, నీటి వసతి ఉన్న చోట 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే రైతులు కూడా ఉన్నారు. అయితే జిల్లా సగటు దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరానికి 21 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తోంది. అంటే ప్రతీ ఎకరా మీద సగటున ఏడు క్వింటాళ్ల వరకు మిగులు కనిపిస్తోంది. ఇలా ఒక కేంద్రంలో ఒక రోజు మిగులుగా వచ్చే మొత్తాన్ని ప్రైవేటు వ్యాపారుల దగ్గరున్న ధాన్యంతో రికార్డుల్లో సర్దుబాటు చేస్తున్నారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక కొనుగోలు కేంద్రం చొప్పున ఉండడంతో స్థానిక రైతులతో ఉండే సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ దందా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. దీంతో చెమటోడ్చిన రైతులకు దక్కాల్సిన ప్రభుత్వ సాయం వ్యాపారుల పరం అవుతోంది. ఈ దందాకు సహకరించిన వారికీ తగిన ఫలితం దక్కుతోంది.
తనిఖీలు కరువు..
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో సాగుతున్న మోసమే నిన్నా మొన్నటి వరకు పత్తి విషయంలోనూ జరిగింది. ఏళ్ల తరబడి ఈ అవినీతి తంతు కొనసాగుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ఫిర్యాదులు రాలేదనే సాకుతో రైతుల కష్టానికి ఫలితం దక్కకుండా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస తనిఖీలు చేయడం లేదు. తేమ శాతంపై అధికారులు పెట్టే శ్రద్ధలో నాలుగో వంతైనా ఇలాంటి అక్రమ వ్యవహారల మీద పెడితే రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంటుంది.
అక్రమాల అడ్డుకట్టకు చర్యలు
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరిగాయని తెలిస్తే మాకు సమాచారం అందించాలని రైతులను కోరుతున్నాం. ఆ వెంటనే ఆయా మండలాల డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి విచారణ చేస్తాం. అక్రమాలు నిజమేనని తేలితే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం.
– రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ధాన్యం కొనుగోళ్లలో సర్దుబాటు దందా
ప్రభుత్వ కేంద్రాల్లో భారీగా అవకతవకలు
రైతుల కోటాలో విక్రయిస్తున్న వ్యాపారులు
వారితో కుమ్మక్కవుతున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment