మొక్కల పెంపకంపై నజర్
● వచ్చే జూలైలో వనమహోత్సవానికి చురుగ్గా పనులు ● జిల్లాలోని 521 నర్సరీల్లో మొక్కలు పెంచేలా ప్రణాళిక ● గత పది విడతల్లో 12.20 కోట్ల మొక్కలు నాటిన అధికారులు
చుంచుపల్లి: వచ్చే జూలైలో నిర్వహించే వనమహోత్సవానికి మొక్కల పెంపకంపై అధికారులు దృష్టిపెట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచనున్నారు. జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 481, అటవీ శాఖ ఆధ్వర్యంలో 40 నర్సరీలు.. మొత్తం 521 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. మందార, రోజా, బాహునియా, తబుబియా, సీతాఫలం, కరివేపాకు, టేకోమా, జామ, దానిమ్మ, గన్నేరు. మునగ, రెడ్ సాండర్స్, బాంబో, గుల్మా హర్, కానుగ, వేప, టేకు, అల్బిజియా, బూరుగు, చింత, చిన్నబాదం, బాదం, ఈత, మారేడు, సీమ తంగేడు, జీడి, జమ్మి, అల్ల నేరేడు, ఉసిరి తదితర 40 రకాల మొక్కలను పెంచనున్నారు. ఇప్పటికే పంచాయతీ హరిత నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు ప్రారంభించారు. ఒక్కో నర్సరీలో 15 వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచనుండగా, ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో పది మంది చొప్పున ఉపాధి కూలీలు పనులు నిర్వహిస్తున్నారు. రైతులు ఆసక్తి చూపుతున్న టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
రూ. 8 కోట్లతో అంచనా
జిల్లాలో 70.65 లక్షల మొక్కలు నాటాలని అధికారులు యోచిస్తున్నారు. మొక్కల పెంపకానికి డీఆర్డీఏ నర్సరీల నిర్వహణకు సుమారు రూ.8 కోట్లమేర ఖర్చు చేసేలా అంచనాలు రూపొందించారు. తొమ్మిది విడతలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించగా, గతేడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కల పెంపకం చేపడుతోంది. 2015లో ఈ కార్యక్రమం ప్రారంభించగా, ఒకటి, రెండు, మూడు విడతల్లో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆయా ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటాయి. జిల్లాలో 10 విడతల్లో 12.20 కోట్ల మొక్కలను పంపిణీ చేసి వివిధ శాఖల ఆధ్వర్యంలో విరివిగా నాటించారు. ఈసారి 70.65 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. కాగా హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది.
నర్సరీల్లో వేగంగా పనులు
డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ పరిధిలో మొక్కలు పెంచేందుకు హరిత నర్సరీలను నిర్వహిస్తున్నాం. ఈసారి ముందుగానే నర్సరీ పనులు ప్రారంభించాం. ప్రస్తుతం సంచుల్లో మట్టిని నింపి విత్తనాలు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ చివరి వరకు మొక్కలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ
జిల్లాలో విడతల వారీగా నాటిన మొక్కల వివరాలు (లక్షల్లో)
విడత లక్ష్యం నాటినవి
మొదటి 116.93 116.49
రెండో 154.12 161.33
మూడో 160.00 163.09
నాలుగో 95.00 96.17
ఐదో 154.62 146.27
ఆరో 118.14 160.29
ఏడో 104.97 135.41
ఎనిమిదో 95.00 105.08
తొమ్మిదో 65.40 55.13
పదో 65.74 70.61
Comments
Please login to add a commentAdd a comment