chipset Crisis : చిప్‌సెట్ల తయారీలో స్వయం సమృద్ధి దిశగా ఇండియా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చైనాపై ఆధారపడకుండా దేశ అవరసరాలకు తగ్గట్టుగా చిప్‌సెట్ల తయారీపై దృష్టి సారించింది.
తగ్గిన ఉత్పత్తి
కరోనా ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చిప్‌సెట్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మొబైల్ ఫోన్ నుంచి మొదలుపెడితే కార్ల తయారీ వరకు అనేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. చిప్‌సెట్ల కొరత కారణంగా కార్లు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామార్థ్యం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చైనాకి చెక్
ఇండియాలో ఉపయోగిస్తున్న చిప్‌సెట్లలో సింహభాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. అయితే సంక్షోభ సమయంలో చిప్ సెట్ల సరఫరా విషయంలో భారత్‌కి స్పష్టమైన హామీ చైనా నుంచి రాలేదు. దీంతో ఎల్లకాలం చైనాపై ఆధారపడకుండా స్వంతంగా భారీ ఎత్తున చిప్‌లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెరపైకి తైవాన్
చిప్‌సెట్ల తయారీలో తైవాన్‌కి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. తైవాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. దీంతో సాంకేతిక రంగంలో తైవాన్ ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఈ మేరకు భారత్ తరఫున ఇటీవల అధికారుల బృంధం తైపీలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
ఒప్పందం
అయితే తైవాన్, భారత్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఇరు దేశాలు బాహాటంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఉన్నతస్థాయి అధికార వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం 7.5 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఇండియాలో చిప్‌ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తైవాన్ ఇండియాకు అందిస్తుంది. ఈ మేరకు చిప్‌సెట్ల తయారీ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పానే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
5జీ టెక్నాలజీ
తైవాన్ , భారత్ ప్రభుత్వం మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం చిప్ తయారీ పరిశ్రమ స్థాపనకు అవుతున్న వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ గవర్నమెంట్ భరిస్తుంది. అంతేకాకుండా ట్యాక్సుల్లో కూడా మినహాయింపు ఇస్తుంది. తైవాన్ సంస్థ నెలకొల్పే చిప్ తయారీ పరిశ్రమలో 5జీ టెక్నాలజీకి సంబంధించిన చిప్‌సెట్ల నుంచి కారు తయారీ వరకు ఉపయోగించే అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్‌ని తయారు చేస్తారు.
బోల్డ్ స్టెప్
తూర్పు లధాఖ్ ప్రాంతంపై ఇండియా చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తైవాన్‌తో కూడా చైనాకు సత్సంబంధాలు లేవు. పదే పదే చైనా యుద్దవిమానాలు తైవాన్ గగనతలంలోకి దూసుకొస్తున్నాయి. అయితే తైవాన్‌కి అండగా అమెరికా నిలబడింది. ఈ తరుణంలో ఏషియాలో కీలకమైన చైనాను కాదని తైవాన్‌తో భారీ వాణిజ్యం ఒప్పందం భారత్ చేసుకుంది. ఇకపై చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని పరోక్షంగా చెప్పింది. అయితే ఈ ఒప్పందంపై అధికార ప్రకటన రాకపోవడంతో చైనా అధికార బృందం మౌనంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment