Sono Motors aims to get Sion solar electric vehicle to market by 2023 - Sakshi
Sakshi News home page

2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?

Published Fri, Nov 19 2021 3:29 PM | Last Updated on Fri, Nov 19 2021 4:19 PM

Sono Motors aims to get Sion solar electric vehicle to market by 2023 - Sakshi

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే వాటికి పోటీగా మార్కెట్‌లోకి వచ్చేందుకు సోలార్ ఎలక్ట్రిక్ కార్లు రెడీ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కొన్నవారు ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు జర్మని దేశానికి చెందిన సోనో మోటార్స్ కంపెనీ 2016 నుంచి సోలార్ కార్లను అభివృద్ది చేస్తుంది. సౌర శక్తిని ఉపయోగించి ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి శక్తిని అందించాలనుకునే ఆలోచన తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది. సోనో మోటార్స్ సహ వ్యవస్థాపకులు జోనా క్రిస్టియన్, లౌరిన్ హాన్ ప్రతి వాహనంపై సోలార్ ప్యానెల్ ఇంటిగ్రేట్ చేసి దాని ద్వారా వాహనాలకు శక్తి అందించాలని భావించారు.

సోలార్ ఎలక్ట్రిక్ వేహికల్ ప్రీ-ప్రోటోటైప్ నిర్మాణంపై ప్రారంభించి 2015 నాటికి ఒక నమూనాను గీశారు. ఆ తర్వాత సంవత్సరం క్రిస్టియన్, హాన్, సృజనాత్మక దర్శకుడు నవీన పెర్న్ స్టీనర్ తో కలిసి సోనో మోటార్స్ సంస్థను స్థాపించారు. రెండు రోజుల క్రితం సోనో మోటార్స్ మాతృ సంస్థ అయిన సోనో గ్రూప్ ఐపీఓ కోసం ప్రజల్లోకి వెళ్లింది. ఈ కంపెనీ మొదటి సోలార్ ఎలక్ట్రిక్ వేహికల్ అయిన సియోన్(Sion) సోలార్ కారు $3,000 డౌన్ పేమెంట్ తో 16,000 ప్రీఆర్డర్స్ అందుకుంది. 28,700 యూరో(సుమారు రూ.24 లక్షలు)లు ఖరీదు చేసే ఈ సోలార్ కాంపాక్ట్ కారు 2023 మొదటి అర్ధభాగంలో మార్కెట్లోకి రావాలని యోచిస్తుంది.
 

(చదవండి: గూగుల్‌ అదిరిపోయే ఫీచర్‌, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!)

ది సియోన్(Sion)
సోనో తన సోలార్ టెక్నాలజీలను ఇతర వాహనాల్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఇతర కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సోనో మోటార్స్ తన సోలార్ బాడీ ప్యానెల్ టెక్నాలజీని ఇతర కంపెనీలకు లైసెన్స్ ఇస్తానని ప్రకటించింది. ఎలక్ట్రిక్ అటానమస్ షటిల్ కంపెనీ ఈజీమైల్ తన మొదటి కస్టమర్ గా పేర్కొంది. చైనా బివైడి సరఫరా చేసే 54 కెడబ్ల్యుహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్(ఎల్ఎఫ్ పి) బ్యాటరీని ఉపయోగించి సియోన్ 305.775 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. సోలార్ ఎలక్ట్రిక్ కారును వాల్ బాక్స్ ద్వారా ఛార్జ్ చేయగలిగినప్పటికీ సౌరశక్తి సహాయంతో కూడా పని చేస్తుంది. ఈ సోలార్ కారును ఎప్పుడు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని జోనా క్రిస్టియన్ చెప్పారు. 

అదే బ్యాటరీ సైజు గల ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే ఈ సోలార్ కారులో నాలుగు రెట్లు ఎక్కువ రేంజ్ వస్తుంది అని  అన్నారు. అల్యూమినియం ఫ్రేమ్ కి 248కు పైగా ఇంటిగ్రేటెడ్ సెల్స్ కూడిన సోలార్ ప్యానెల్స్ తో దీనిని కవర్ చేస్తారు. కారు ఆన్ బోర్డ్ బైడైరెక్షన్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. దీని వల్ల ఇంట్లోని ఇతర విద్యుత్ పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనానికి సంబంధించిన ప్రీఆర్డర్లు ఎక్కవగా యూరప్ దేశాల నుంచి వచ్చాయి. సోనో తన కర్మాగారంలో వాహనాలను ఉత్పత్తి చేయడానికి నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్వీడన్(నెవ్ఎస్)తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ఈ కర్మాగారం సంవత్సరానికి 43,000 కార్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని, ఏడు సంవత్సరాలలో సుమారు 260,000 వాహనాలు ఉత్పత్తి చేయనున్నట్లు క్రిస్టియన్ చెప్పారు.

(చదవండి: సహారాకి షాక్‌ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్‌ చేయండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement