కొత్త బండి.. ఆగిపోతోందండి!
● బీఎస్–6 వాహనాలే అధికం ● కొత్తరకం వాహనాలకు సెన్సార్.. ● టెక్నాలజీకి తగ్గట్టు అందని మరమ్మతు సేవలు ● ఎన్నిసార్లు బాగుచేసినా, మళ్లీ అదే సమస్యలు
● చిత్తూరు నగరానికి చెందిన శిరీష 2022లో బీఎస్–6 రకం వాహనాన్ని కొనుగోలు చేసింది. ఈ వాహనం ఏడాది పాటు సవ్యంగా నడిచింది.ఆ తర్వాత స్టార్టింగ్ ట్రబుల్ మొదలైంది. సర్వీసు సెంటర్‌లో బండి ట్ర బుల్ ఇస్తోందని గుచ్చి గుచ్చి అక్కడి సిబ్బందికి చెప్పింది. ఆ సరిచేశాములే అంటూ వా రు బండిని అప్పగించారు. అయినా ప్రతి సర్వీసుకు మళ్లీ అదే సమస్య తలెత్తడంతో కస్టమ ర్ సెంటర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కొన్ని పరికరాలు మార్చినా మళ్లీ ట్రబుల్ ఇస్తోంది. బండి రన్నింగ్‌లోనే ఆగిపోతోంది. తీరా విచారిస్తే బీఎస్–6 స్థాయికి తగ్గట్టు సేవలందించే వ్యవస్థ లేదని తెలిసింది.
● చైతన్యకి చెందిన టూవీలర్ కూడా సెల్ఫ్ స్టార్ట్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. బండి రన్నింగ్‌లో కూడా మధ్యలో ఆగిపోతోంది. బయట మెకానిక్స్ చూసి బీఎస్–6 షోరూం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిందేనని చెప్పారు. సర్వీస్ సెంటర్‌కు వెళితే అక్కడ టూల్‌కిట్ లేదని తిప్పి పంపించారు. కిట్ వచ్చిందనే కాల్ చేస్తామని పంపించేశారు. ఇలా ఈ రెండు వాహనాలు కాదు.. చాలా వాహనాలు రన్నింగ్‌లోనే మొరాయిస్తున్నాయి. ఎందుకో ఆగిపోతున్నాయో షోరూమ్ సిబ్బందికీ తెలియకపోవడం గమనార్హం.
ఇటీవల కాలంలో కొత్త టెక్నాలజీ, మోడల్స్‌తో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అందులోనూ కాలుష్య నివారణ దిశగా కంపెనీలు, ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు టెక్నాలజీని జోడిస్తోంది. కొత్త రకంతో ప్రస్తుతం బీఎస్–6 వాహనాలు అధికంగా తిరుగుతున్నాయి. అయితే టెక్నాలజీకి తగ్గట్టు వాటికి సేవలు లేకపోవడంతో వాహనదారులు టెన్షన్ పడిపోతున్నారు. మరమ్మతులు చేసినా మళ్లీ అదే సమస్యలు తలెత్తడంతో తలులు పట్టుకుంటున్నారు.
కాణిపాకం: ప్రస్తుత రోజుల్లో ఒక చేతిలో ఫోన్..మరో చేతిలో బండి ఉంటేనే పనులు జరుగుతుంటాయి. ఏ చిన్న పనికి అయినా ఇవి రెండు కళ్లుగా పనిచేస్తాయి. అలాంటిది ఏ ఒక్కదానికి సమస్య వచ్చిన మనిషికి చేతులు...కాళ్లు ఆడవు. ప్రధానంగా ద్విచక్ర వాహనం లేనిదే ఇంటా..బయట పనులు జరగదు. బండికి చిన్న ట్రబుల్ ఇచ్చిన తంటాలుపడిపోతుంటారు. జిల్లాలో 70 వరకు అన్ని రకాల వాహనాల షోరూంలున్నాయి. వీటి నుంచి ప్రతి నెలా వందల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 5.5 లక్షల ద్విచక్ర వాహనాలు, 3 లక్షల వరకు కార్లు ఉన్నాయని రవాణా శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో బీఎస్–6 రకం వాహనాలు సుమారు 2 లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఈ వాహనాలకు కాలుష్య రహితంతోపాటు సెన్సార్ సిస్టంను అమర్చారు. ఈ విధానం ద్వారా బండిలోని లోటుపాట్లను సులభంగా గుర్తించి మరమ్మతులు చేయించుకోవచ్చు. అయితే అందుకు తగ్గట్టు కొన్ని సర్వీసు సెంటర్లలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. బండి సర్వీసుకు ఇచ్చినా సంతృప్తిని ఇవ్వడం లేదని వాహనచోదకులు వాపోతున్నారు. ప్రధానంగా బీఎస్–6 ద్విచక్ర వాహనాలకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు, మెకానిక్స్ చెబుతున్నారు.
సర్వీసుల్లో తృప్తి ఏదీ?
షోరూంల సిబ్బంది కొందరు వాహనాలను సరిగ్గా సర్వీస్ చేయడంలేదు. ఏదో తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ప్రధానంగా బీఎస్–6 వాహనాలకు సర్వీసు సెంటర్లలో పూర్తి స్థాయిలో విడిభాగాలు దొరకడం లేదు. ఇక సర్వీసు విషయానికి వస్తే.. టెక్నాలజీకి తగ్గటు అక్కడ వ్యవస్థ (సిస్టం) లేదని వాహనదారులు చెబుతున్నారు. బీఎస్–6 వాహనాలను సిస్టంకు కనెక్ట్ చేసి అందులో ఏ భాగం మరమ్మతుకు గురైందో వెంటనే చెప్పే టెక్నాలజీ ఉంది. కానీ ఆర కంగా జిల్లాలో చాలా చోట్ల సర్వీసు సెంటర్‌లు సిస్టం ఏర్పాటు చేయడం లేదు. సర్వీసుకు వెళ్లినప్పుడల్లా పరికరాలు, సర్వీసు చార్జీల బాదుడు మాత్రం అధికంగా ఉంటోంది. దీనిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు చేస్తాం
కాలుష్య నివారణలో భాగంగానే కొత్తరకం వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. పెరిగిన టెక్నాలజీకి తగ్గట్టు బండ్లు ఉన్నాయి. వాటిని టెక్నాలజీ ఉపయోగించి రిపేర్ చేసేలా సెట్ చేశారు. అందుకు తగట్టు సిస్టంలు సర్వీసు సెంటర్లో ఉన్నాయా.. లేదా తనిఖీలు చేస్తాం. దీనిపై షోరూం నిర్వాహకులకు వివరిస్తాం. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటాం.
–నిరంజన్‌రెడ్డి, డీటీసీ, చిత్తూరు
అంతా బీఎస్–6 మహిమ
బీఎస్–6 వాహనాల రిపేర్లను పూర్తి స్థాయిలో అందరూ మెకానికల్స్ చేయలేరు. కొన్ని విడిభాగాలను మార్చగలరు. ఇతరత్రా వాటిని చాకచక్యంగానే రిపేర్ చేయగలరు. ప్రధానంగా బీఎస్–6 ఇంజిన్‌లోపం ఉంటే దాన్ని మాత్రం ముట్టుకోరు. ఒక వేళ ముట్టుకున్నా వాటిని రిపేర్ చేసే సమయంలో తికమకపడుతుంటారు. ఒక విడిభాగాన్ని మార్చాలంటే గంటల కొద్దీ సమయం తీసుకుంటారు. అదే ఆయా సర్వీసు సెంటర్లకు వెళితే విడిభాగాలను సులభంగా మార్చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న స్టార్టింగ్ ట్రబుల్ సమస్య పరిష్కారంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ వాహనాల్లో చాలా వరకు స్టార్టింగ్ సమస్యలు వస్తున్నాయి. నిత్యం నడుపుతున్న బండి ఒక్కసారిగా ఆగిపోతే కిక్కర్ తొక్కి తొక్కి అలసిపోతున్నారు. స్టార్ట్ అయి బండి రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆకస్మాత్తుగా ఆగిపోతే గుండె ఝల్లుమంటోంది. చాలా మంది వాహనాలను విధి లేని పరిస్థితుల్లో నడుపుతున్నారు. వాహనాలను సర్వీసులకు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. మళ్లీ అదే ట్రబుల్ ఇస్తోంది. సర్వీసు సెంటర్‌కు వెళితే పదే పదే బుడ్డ కాయల్, మాగ్యనెట్ పోయిందని, ఆర్డర్ పెట్టుకుంటే స్పేర్ వచ్చేందుకు 10 రోజులు పడుతోందని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో చాలా మంది రోజువారీ పనులను వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment