తెల్లదొరలతో పోరాడిన ధీరుడు బిర్సా
చిత్తూరు కలెక్టరేట్ : బ్రిటీష్ పాలకులతో పోరాడిన ధీరుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా అని డీఆర్‌ఓ మోహన్ కుమార్ అన్నారు. సంజయ్‌గాంధీ నగర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జన జాతీయ గౌరవ్ దివస్ (గిరిజన స్వాభిమాన ఉత్సవాలు) కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన డీఆర్‌ఓ మాట్లాడుతూ గిరిజన తెగకు చెందిన భగవాన్ బిర్సా తనకు ఉన్న జ్ఞానంతో బ్రిటీష్ పాలకులను ఎదిరించారని చెప్పారు. ఆయనను గిరిజనులు స్ఫూర్తిగా తీసుకుని విద్యలో రాణించాలన్నారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలకు సంబంధించిన విజ్ఞానం కొరవడుతోందన్నారు. విద్యార్థులు ఎక్కువగా సెల్‌ఫోన్‌లో బంధీ అయిపోతున్నారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను నేటి విద్యార్థులు చదివి చైతన్యం పెంచుకోవాలని సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి మాట్లాడుతూ భగవాన్ బిర్సా 25 ఏళ్ల వయసులోనే తరతరాలకు స్ఫూర్తి కలిగించి చరిత్రలో నిలిచారన్నారు. గిరిజన జాతిలో చైతన్యం తీసుకొచ్చిన ఆయన 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి గిరిజనుడు ఖచ్చితంగా ఆధార్‌కార్డు కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి గిరిజనుడికి ఆధార్‌కార్డు ఉండేలా కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఆధార్‌కార్డులతో పాటు ఆరోగ్య పరీక్షలను చేయిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రేఖ, ఎన్‌జీవో సంస్థల అధినేతలు రామాచారి, ధన శేఖర్, వేల్కూరు రవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment