నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు శుక్రవారం నెల్లూరుకు చెందిన రజనీకాంత్ రూ.లక్ష విరాళం ఇచ్చారు. అధికారులు దాత కుటుంబానికి స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం అల్పిసి (కార్తీక) పౌర్ణమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకుజామున మూలవిరాట్‌కు అన్నాభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం వరకు అర్జిత సేవలను రద్దు చేశారు. అలాగే అనుబంధ మరగదాంబిక సమేత మణికంఠేశ్వరస్వామి, పెరిందేవి సమేత వరదరాజస్వామి ఆలయాల్లోనూ వేకువజాము నుంచి రాత్రి వరకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేదార గౌరీ వ్రతాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు.
కెనరాబ్యాంక్ సేవలు మరింత విస్తృతం
తిరుపతి కల్చరల్: కెనరా బ్యాంక్ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయనున్నట్లు ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణరాజు తెలిపారు. ఆర్సీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంక్ నూతన పద్ధతులను పాటించి, మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పటి వరకు తిరుపతిలో బ్యాంకులకు సంబంధించిన రీజినల్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, సర్కిల్ ఆఫీసును ఒక కెనరా బ్యాంక్ మాత్రమే ఏర్పాటు చేసిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఏఐ టెక్నాలజీ వినియోగించి ఏఐ1 యాప్‌ను కెనరా బ్యాంక్ రూపొందించిందన్నారు. దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నింటిలో తమ బ్యాంకు రూపొందించిన ఏఐ1యాప్‌కు 2.62 కోట్ల మంది యూజర్స్ ఉన్నారని తెలిపారు. 11 భాషల్లో ఏఐ1 యాప్ పని చేస్తోందని తెలిపారు. బ్రాంచ్ జీఎం పాండురంగ మితంత్య, బ్రాంచి జీఎడబ్ల్యూ జీఎం రామనాయక్, కేంద్ర కార్యాలయం జీఎం రవికృష్ణ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్, పాల్గొన్నారు.
పంటలపై ఏనుగుల దాడులు
పెద్దపంజాణి: మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొంత కాలంగా పెద్దకాప్పల్లి పంచాయతీ ఆకులవారిపల్లి, గౌరీనగర్, ముదిరెడ్డిపల్లి, జిట్టంవారిపల్లి, పెనుగొలకల, పెద్దకాప్పల్లి, తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి రైతులకు చెందిన పంటలను నాశనం చేస్తున్నాయి. గురువారం రాత్రి పలమనేరు ఫారెస్టు రేంజ్ కీలపట్ల బీటు నుంచి వచ్చిన ఏనుగులు ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పంటలను ధ్వంసం చేశాయి. చంద్రప్ప, సురేంద్ర తదితరుల వరి పంటను తొక్కి నాశనం చేశాయి. శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు పంటనష్టాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధిత రైతులు మాట్లాడుతూ చేతికొచ్చిన పంటను ఏనుగుల వల్ల నష్టపోతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. భారీగా పంట నష్టం జరిగినా అధికారులు మాత్రం నామమాత్రంగా పరిహారం చెల్లిస్తున్నారని వాపోయారు. గజ దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. సమాచారం అందుకున్న రాయలపేట ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్ పంట నష్టాన్ని పరిశీలించారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ట్రాకర్ల సాయంతో ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment