అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి
శ్రీరంగరాజపురం : పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోమంత్రి అమిత్‌షా దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ భవిష్యత్ సమగ్ర అభివృద్ధి కోసం కొంతమంది మేధావులు ఆలోచిస్తారని అందులో ప్రథముడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని అన్నారు. అలాంటి మహనీయుడిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కించపరచడం తగదని హితవు పలికారు. ఇంతలా అమిత్‌షా వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇంత వరకు ఖండించకపోవడం బాధాకరమని అన్నారు. జగనన్న రెక్కల కష్టంతో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులు పదవులు పొందిన వారు నేడు పార్టీని వీడి స్వార్థ ప్రయోజనాల కోసం జగనన్నను విమర్శించడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఇళ్ల సర్వే
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని సబ్సిడీ విద్యుత్ అందుకుంటున్న ఎస్సీ ఎస్టీ సర్వీసులను సర్వే చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఎస్‌ఈ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో దాదాపు 86 వేల మంది బడుగులు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారని చెప్పారు. వారికి పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకుగాను ప్రతి సర్వీసును తనిఖీ చేసి రేకులు, పెంకులు, స్లాబు ఇళ్ల అనే అంశాలను పరిశీలించాలని చెప్పారు. అనంతరం అక్కడ సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి సౌకర్యం ఉందా అని చూడాలన్నారు. లబ్ధిదారులు ఎంత లోడ్ కలిగి ఉన్నాడు, ప్రతి నెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. సర్వీసుదారుడి ఆధార్, ఫోన్ నెంబర్, కరెంటు బిల్లులను సేకరించాలని తెలిపారు. వారి వద్ద సోలార్ పలకల కోసం రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. పీఎం కుసుం పథకం కింద సబ్‌స్టేషన్‌లోని ఫీడర్ల పరిధిలో సర్వే నిర్వహించాలని చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఖాళీ స్థలం ఎంత ఉందో నివేదించాలన్నారు. అక్కడ 1 మెగావాట్ విద్యుత్‌ను ఉత్పతి చేసే సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో సంబంధిత వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ అందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, జగదీష్, ఏఓ ప్రసన్నఆంజనేయులు, పీఓ రెడ్డప్ప, డీఈలు ప్రసాద్, ఆనంద్, శేషాద్రి, కొండయ్య, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
వరసిద్ధునికి విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం నిత్య అన్నదానానికి దాతలు శుక్రవారం నగదు విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి రూ.లక్ష, విజయవాడకు చెందిన చల్లా శివ మీనాక్షి రూ.లక్ష నగదు అందించారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించి స్వామి ప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment