పంటలపై ఏనుగుల దాడులు
పెద్దపంజాణి: మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా పెద్దకాప్పల్లి, నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు చెందిన పంటలను నాశనం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి పలమనేరు ఫారెస్టు రేంజ్ కీలపట్ల బీటు నుంచి వచ్చిన ఏనుగులు నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లావారిపల్లి సమీపంలోని పంటలపై విధ్వంసం సృష్టించాయి. గోపి, చెంగల్రాయప్ప తదితరులు సాగు చేసిన టమాట పంటను ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు పంటను ఏనుగులు తొక్కేయడంతో తీరని నష్టం వాటిల్లిందని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతికొచ్చిన పంట ఏనుగుల వల్ల నష్టపోతున్నామని కన్నీరు మున్నీరయ్యారు. భారీగా పంట నష్టం జరిగినా అధికారులు మాత్రం నామమాత్రంగా పరిహారం చెల్లిస్తున్నారని వాపోయారు. గజ దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. బాధిత రైతుల సమాచారంతో రాయలపేట ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్ పంట నష్టాన్ని పరిశీలించారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ట్రాకర్ల సాయంతో ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రోడ్డు భద్రత పాటించండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చూడాలని జేటీసీ కృష్ణవేణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై చర్యలు ఏవని ప్రశ్నల వర్షం కురిపించారు. కచ్చితంగా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చూడాలన్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే జరిమానాలు విధించాలన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపై వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ నిరంజన్‌రెడ్డి, ఆర్టీఓ సునీల్, ఎంవీఐలు రాజేశ్వరరావు, వాసుదేవారెడ్డి, శివకుమార్, దీపిక, కుసుమ తదితరులు పాల్గొన్నారు.
సారా రహిత రాష్ట్రమే లక్ష్యం
పుత్తూరు: సారా రహిత రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఈఎస్ వాసుదేవచౌదరి పిలుపునిచ్చారు. శనివారం పుత్తూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని తిరువట్యం గ్రామంలో సారా, గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సారా అనేది లేకుండా చేయడంతో పాటు సారా తయారీకి అలవాటు పడిన వారిలో పరివర్తన తీసుకురావడానికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగించినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవ న్నారు. అంతకముందు గ్రామ అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 200 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో పుత్తూరు ఎకై ్సజ్ సీఐ మురళీమోహన్, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment