సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 10.00.15 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ60 ప్రయోగంతో విజయవంతమైంది. ఇప్పటిదాకా 62 ప్రయోగాలు చేయగా రెండు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. 1993 సెప్టెంబర్ 20న పీఎస్‌ఎల్‌వీ డీ1 పేరుతో మొదటి ప్రయోగాన్ని నిర్వహించారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైంది. మళ్లీ 2018లో ఒక ప్రయోగం విఫలమైంది. గడిచిన 30 సంవత్సరాల్లో పీఎస్‌ఎల్‌వీ సీ60 ప్రయోగంతో 60 ప్రయోగాలను విజయవంతం చేశారు. ఇప్పటిదాకా 62 పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 505 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో 433 విదేశీ ఉపగ్రహాలే కావడం విశేషం. 72 స్వదేశీ ఉపగ్రహాలతో పాటు దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన 13 చిన్నపాటి ఉపగ్రహాలను ప్రయోగించారు. రెండు నుంచి నాలుగు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి పంపిస్తుంటే.. అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగిస్తోంది. వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చే అతిపెద్ద ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్, సూర్యయాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన సత్తా పీఎస్‌ఎల్‌వీకే మాత్రమే దక్కింది.
పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగం ఇలా..
పీఎస్‌ఎల్‌వీ సీ–60 రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో, రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు. ఈ ప్రయోగంలో 440 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్ పేరుతో రెండు జంట ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
● పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్ 44.5 మీటర్లు ఎత్తు కలిగి ప్రయోగ సమయంలో 229 టన్నులతో ప్రయాణం ప్రారంభించింది. దీనికి స్ట్రాఫాన్ బూస్టర్లు లేవు కాబట్టి 229 టన్నుల బరువుతో నింగివైపు దూసుకెళ్లింది.
● కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి 111.12 సెకండ్లకు మొదటి దశను పూర్తిచేశారు.
● రెండో దశలో 188.32 సెకండ్లకు రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలకు అమర్చిన రక్షణ కవచం హీట్‌షీల్డ్ విడిపోయింది. ఈ దశలో 41 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 262.06 సెకండ్లకు పూర్తిచేశారు.
● మూడో దశలో 7.65 టన్నుల ఘన ఇంధనంతో 511.22 సెకండ్లకు పూర్తిచేశారు.
● 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 792.48 సెకండ్లకు నాలుగో దశను కటాఫ్ చేశారు.
● తర్వాత ట్రిమ్మింగ్ మాడ్యూల్‌తో 909.48 సెకండ్లకు అంటే 15.15 నిమిషాలకు 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్–బీ అంటే టార్గెట్ ఉపగ్రహాన్ని, 912.48 సెకండ్లకు అంటే 15.20 నిమిషాలకు మరో 220 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్–ఏ అంటే ఛేజర్ ఉపగ్రహాలు రెండింటినీ భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులో సెమీ మేజర్ యాక్సిస్ అనే కొత్తరకం కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment