రామకుప్పం పీహెచ్‌సీ తనిఖీ
రామకుప్పం: మండలకేంద్రం రామకుప్పం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి.టి.సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించడంతో పాటు మందులను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణాధికారి వెంకటప్రసాద్, జిల్లా మలేరియా అధికారి అనిల్, వైద్యాధికారులు హరినాథ్ రెడ్డి, లోకేష్, దీప, మస్తాన్ బాషా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఒంటరిగా వెళ్లొద్దు
చౌడేపల్లె: మండలంలోని తెల్లనీళ్లపల్లె, పరిసర గ్రామాల ప్రజలు ఒంటరిగా పంటపొలాలు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అంటూ ఫారెస్ట్ ఎ్‌ఫ్‌బీఓ ప్రభాకర్ సూచించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘తెల్లనీళ్లపల్లెలో చిరుత’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు ప్రజలతో తెల్లనీళ్లపల్లెలో సమావేశం నిర్వహించి చైతన్యం కల్పించారు. పంటపొలాల్లోకి, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లడం, పశువులు, మేకలు, గొర్రెలను తోలుకెళ్లరాదని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే వెంటనే కేకలు పెట్టి శబ్దం చేయాలన్నారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిధులు మంజూరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లాలోని 31 ఎంఈఓ కార్యాలయాలకు నిధుల మంజూరుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఒక్కో ఎంఈఓ కార్యాలయానికి రూ.1.30 లక్షల చొప్పున మొత్తం నాలుగు విడతల్లో నిధులు ఇవ్వనున్నారు. మొదటి విడతగా రూ.60 వేలు చొప్పున మంజూరు చేయనున్నారు. ఆ నిధులతో స్టేషనరీ, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులు, భవనాల మరమ్మతులు తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
క్యూఆర్ కోడ్‌పై అవగాహన కల్పించండి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ బిల్లులపై ఈనెల నుంచి క్యూఆర్ కోడ్‌తో పాటు ఇస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ఈఈ, డీఈలతో సమావేశం నిర్వహించారు. కరెంటు బిల్లులు చెల్లించడానికి క్యూలైన్‌లో వేచిచూసే పనిలేకుండా నూతన విధానం ప్రవేశ పెట్టారన్నారు. బిల్లులో క్యూఆర్ కోడ్ వస్తుందని, దాన్ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చన్నారు. దీనిపై సిబ్బంది క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఈఈ, డీఈలకు డ్యూటీలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, శ్రీనివాసమూర్తి, వాసుదేవరెడ్డి, జగదీష్, అమర్‌బాబు డీఈలు తదితరుల పాల్గొన్నారు.
681 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ వరకు 681 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ విద్యాధరి వెల్లడించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 822 రెవెన్యూ గ్రామాలకు గానూ 681 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి అయినట్లు చెప్పారు. మిగిలిన 141 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 9,677 అర్జీలు అందగా, 226 అర్జీలు పరిష్కరించినట్లు జేసీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment