పింఛను మంజూరు చేయాలని కలెక్టర్ కు విన్నవిస్తున్న భాదితులు (ఫైల్)
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత
కొత్త పింఛన్ల కోసం వితంతువులు, వృద్ధుల ఎదురుచూపులు
నేటి నుంచి జిల్లాలో దివ్యాంగ పింఛన్ల క్షేత్రస్థాయి పరిశీలన
కొత్త పింఛన్లు ఇవ్వకుండా ఉన్నవి తొలగించేందుకు కూటమి సర్కారు సిద్ధం
చిత్తూరు కలెక్టరేట్: జిల్ల్యావాప్తంగా దివ్యాంగ పింఛన్ల తనిఖీకి అధికారులు సిద్ధమయ్యారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నానే ఆరోపణల నేపథ్యంలో వారిని గుర్తించి తొలగించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కులం, వర్గం, పార్టీ, ప్రాంతం అనే తేడా లేకుండా అర్హులందరికీ పింఛన్లు అందజేసింది.
నూతన సంవత్సరం ఆరంభంలోనే కోతలు..
దివ్యాంగ పింఛనుదారుల్లో అనర్హులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో అనర్హుల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జనవరి 3వ తేదీ నుంచి జిల్లాలో మంచానికే పరిమితమైన విభాగంలో రూ.15 వేలు, వైకల్య ధ్రువపత్రాలతో రూ.6 వేలు చొప్పన పింఛన్లు పొందుతున్న వారి పత్రాలు, వివరాలను సమగ్రంగా పరిశీలించి కోతలు వేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం 35,374 దివ్యాంగ పింఛన్లు
చిత్తూరు జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం నెలకు 35,374 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. వీరికి నెలకు రూ.21.31 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీరిలో పక్షవాతం, ప్రమాదాల బారిన పడి మంచానికే పరిమితమై రూ.15 వేలు పింఛను పొందేవారు 1,936 మంది ఉన్నారు. మిగిలిన దివ్యాంగులతో కలిపి ప్రతినెలా ప్రభుత్వం రూ.2.92 కోట్లు మంజూరు చేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేశారు. గత ఐదేళ్లల్లో మంజూరు చేసిన పింఛన్లను తొలగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
పరిశీలన ఇలా..
జిల్లాలో మంచానికే పరిమితమైన విభాగంలో పింఛను పొందుతున్న వారి ఇళ్లకు వైద్యులు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. దీని కోసం ఇతర నియోజకవర్గాల్లో వైద్యులను నియమిస్తారు. వీరు పరిశీలన జరిపి సెర్ప్ రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమై నెలాఖరు నాటికి పూర్తవుతుంది. వైకల్య ధ్రువీకరణ పత్రాలతో నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న వారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య పరీక్షలు చేయనున్నారు. ఈ పరిశీలన ఈ ఏడాది మే నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా సమాచారం
జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822
జిల్లాలోని గ్రామ పంచాయతీలు 697
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 612
జిల్లాలోని నగరపాలక, మున్సిపాలిటీలు 05
జిల్లాలోని జనాభా 18.73 లక్షలు
పురుషుల జనాభా 9.40 లక్షలు
మహిళల జనాభా 9.33 లక్షలు
అర్బన్ జనాభా 3.69 లక్షలు
రూరల్ జనాభా 15.04 లక్షలు
జిల్లాలోని మొత్తం పింఛన్లు 2,56,511
దివ్యాంగ పింఛన్లు 35,374
వితంతు పింఛన్ ఎప్పుడిస్తారు ?
నాది ఎస్‌ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామం. నా భర్త అకస్మాత్తుగా మృతి చెందారు. ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ కోసం మండల అధికారుల వద్దకు వెళ్లి అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అందువల్లే కలెక్టర్ కార్యాలయంలో వినతి ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. వితంతు పింఛన్ మంజూరు చేసి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాను.
– సుజాత, అర్జీదారురాలు, ఎస్‌ఆర్ పురం మండలం
Comments
Please login to add a commentAdd a comment