ఎరువు.. నాణ్యత కరువు.. | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. నాణ్యత కరువు..

Published Fri, Jan 3 2025 2:09 AM | Last Updated on Fri, Jan 3 2025 7:21 PM

ఎరువు గోడౌన్‌

ఎరువు గోడౌన్‌

జిల్లాలో పలు దుకాణాల్లో ఎరువుల విక్రయాల్లో మోసాలు 

వ్యాపారుల మాయజాలం 

బస్తాపై రూ.30 నుంచి రూ.100 వరకు తేడా 

పనిచేయని ఎరువులు, పురుగు మందులు 

వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు.. తనిఖీలు శూన్యం 

ఫిర్యాదు చేస్తే ఆధారాలు కావాలంటున్న వైనం 

తమిళనాడు, కర్ణాటకకు వెళ్లి ఎరువులు, మందులను తెచ్చుకుంటున్న రైతులు

లాభాపేక్షతో ఎరువుల వ్యాపారులు కల్తీ, నకిలీ మందులు విక్రయిస్తుండడంతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లుతోంది. తనిఖీలు చేయాల్సిన అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. దాడులు చేయడం ఆపేసి నాణ్యత లేని ఎరువులు, పురుగు నివారణ మందుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు మాయజాలం చేస్తున్నారు. దీనికితోడు ఎరువుల రేట్లు అధికంగా ఉండడంతో రైతులు కొనలేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. 

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): దేశానికి అన్నం పెట్టే అన్నదాత మనుగడను అటు ప్రభుత్వాలు, ఇటు ఎరువుల వ్యాపారులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల నాణ్యత లేని ఎరువులు రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పలుచోట్ల నకిలీ ఎరువులు, పురుగు మందులతో ఉసురు తీస్తున్నాయి. బయో ఎరువుల్లో నాణ్యత కరువైంది. పంటల్లో నకిలీ ఎరువులు, మందులు వేసి దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు విక్రయించాల్సి ఉన్నా.. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వ్యాపారులు మందులు, ఎరువులను అధిక రేట్లకు విక్రయిస్తున్నా.. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో ఎరువులు, పురుగు మందుల విషయంలో మాయాజాలం నడుస్తోంది.

ఎరువు నిల్వలు..

జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలు 212 దాకా ఉన్నాయి. వీటిలో 6 హోల్‌సేల్‌ దుకాణాలు, 206 రిటైల్‌ దుకాణాలు ఉన్నాయి. అయితే కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఎరువులు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పట్టణ ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇక కొన్ని దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో నాణ్యత కొరవడుతోందని, కల్తీ ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పలు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులు నెల మామూళ్లకు అలవాటు పడి తమకు అనుకూలంగా ఉన్న వ్యాపారుల వద్దే ఎరువులు, మందులు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ శాఖలోని కొందరు అధికారులే బహిరంగంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది.

అధిక రేట్లకు తోడు..

జిల్లాలోని పలు దుకాణాల్లో విక్రయించే ఎరువులు, పురుగు మందులు నాణ్యత కొరవడినా.. రేట్ల విషయంలో మాత్రం తగ్గేదేలా అన్నట్టు ఉంది. ఎరువుల ధరలు రైతులను పిండి పిప్పిజేస్తున్నాయి. తమిళనాడుకు, జిల్లాలో విక్రయించే వాటికి రేట్లలో చాలా తేడాలు ఉన్నాయి. యూరియా బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు తేడా ఉన్నాయి. అలాగే పిచికారీ మందులు కంపెనీ, పంటను బట్టి రూ.100 నుంచి రూ.200 వరకు తేడా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో పాటు విత్తనాలు సైతం నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నాయి. రేట్లు కూడా జిల్లాలో అమాంతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతుల మేలు చేసేలా చూడాలని పలువురు వేడుకుంటున్నారు.

రబీ సాగు చూస్తే..

జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 23,384 హెక్టార్లు ఉండగా 17,817 హెక్టార్ల వరకు పలు రకాల పంటలు సాగయ్యాయి. ఈ సీజనల్‌లో నీటి వసతిని బట్టి వరిపంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. వరి సాధారణ విస్తీర్ణం 10,983 హెక్టార్లు ఉండగా.. 1,748 హెక్టార్ల వరకు సాగైంది. ఇంకా వరినాట్లు విస్తారంగా పడుతున్నాయి. ఉలవలు 7422 హెక్టార్లకు గాను 13320 హెక్టార్లలో, వేరుశనగ 2818 హెక్టార్లకు గానూ 551 హెక్టార్లలో సాగు అయింది. అలాగే ఉద్యానశాఖ పంటలు 75754.18 హెక్టార్లు సాగులో ఉండగా మామిడి సాగు 1.50 లక్షల ఎకరాల్లో ఉంది. అరటి 812.40 హెక్టార్లు, నిమ్మ 96 హెక్టార్లు, జామ 204 హెక్టార్లు, బొప్పాయి 443 హెక్టార్లు, బీన్స్‌ 1161 హెక్టార్లు, టమాట 1452.86 హెక్టార్లు, మిరప 12.76 హెక్టార్లు సాగులోకి వచ్చింది. వీటికి వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్లు వ్యాపిస్తుంటాయి. పంట ఎదుగుదలకు ఎరువులు అవసరం. అయితే కొంతవరకు రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండగా మిగిలిన ఎరువులు, పురుగు మందులు పట్టణ ప్రాంతాల్లోని ఫర్టిలైజర్స్‌ దుకాణాల్లో కొనుగోలు చేయాలి.

జిల్లాలోని ఎరువు స్టాక్‌ వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

ఎరువు రకాలు; గోడౌన్‌; హోల్‌సేల్‌; రిటైల్‌; సరఫరాలో

యూరియా 319.600 285.205 3741.44 128.475

డీఏపీ 0.800 129.150 586.600 14.350

ఎంఓపీ 71.250 12.000 364.670 0.000

ఎన్‌పీకేఎస్‌ 582.050 24.150 2269.69 62.200

ఎస్‌ఎస్‌పీ 22.350 76.400 391.100 1.000

కంపోస్ట్‌ 12.300 0.000 0.000 0.000

తనిఖీలు చేస్తే ఒట్టు..

ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయ కేంద్రాలపై వ్యవసాయ శాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల పోరు పడలేక తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. రికార్డులు చూసి తనిఖీలు చేసినట్లు ఫొటోలతో సరి పెట్టుకుంటున్నారు. దీంతో కొందరు దుకాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది కాలంలో 4 హోల్‌సేల్‌ షాపులు, 186 రిటైల్‌ డీలర్లను తనిఖీ చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం.

ఇక్కడి మందులు పనిచేయవు

జిల్లాలోని డీలర్ల వద్ద విక్రయించే ఎరువులు, పురుగు మందులు పనిచేయడం లేదు. అందుకే తమిళనాడులోని వేలూరుకు వెళ్లి తెచ్చుకుంటా. అదే మాదిరిగానే గుమ్మడికాయ విత్తనాలు కేజీ రూ.300 ఇక్కడ, అదే వేలూరులో రూ.220కే ఇస్తున్నారు. విత్తనం కూడా క్వాలిటీగా ఉంది. ఇక్కడ షాపుల్లో ధరలు అరికట్టి.. పంటకు ఉపయోగ పడే మందులు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది.

– బాబు నాయుడు, రైతు, చిత్తూరు

తమిళనాడులో రేట్లు తక్కువ..

తమిళనాడులో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో చాలావరకు లేకపోవడం, నాణ్యత ఉండకపోవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లోని తమిళనాడుకి వెళ్లాల్సి వస్తుంది. మాకు ఎక్కువ కావాల్సింది యూరియా, డీఏపీ, జింక్‌ సల్ఫేట్‌, పొటాషియం. అక్కడ డీఏపీ రూ.1450, యూరియా రూ.300 ధరలకే దొరుకుతుంది. అందువల్ల ఎక్కువమంది తమిళనాడుకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది.

– గోవింద మందడి, రైతు, కార్వేటినగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement