సంప్రదాయ కళాకాంతులు
ప్రపంచీకరణ నేపథ్యం.. అరచేతిలో జగమంతా ప్రత్యక్షం.. ఈ తరుణంలో సంస్కృతి, సంప్రదాయంతోపాటు కళలు కనుమగయ్యాయి. అయితే ఆ సాంకేతిక జగతి నుంచి నేటి తరం మళ్లీ సంప్రదాయ కళలపై ఆసక్తి చూపుతున్నారు. నగర జీవనంతో విసుగెత్తిన యవతరం పండుగలకు ఇళ్లకు వచ్చిన సమయంలో సంప్రదాయకళలను ప్రోత్సహించేలా పౌరాణిక, సాంఘిక నాటకాలతోపాటు హరికథల ప్రదర్శనకు ప్రాముఖ్యత నిస్తున్నారు. దీంతో సంప్రదాయ కళలకు మళ్లీ కాంతులు వచ్చాయి.
పలమనేరు: నాడు ఆబాలగోపాలాన్ని అలరించిన సంప్రదాయ కళలు మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి. ప్రపంచీకరణ పుణ్యామని సంప్రదాయ కళలు దీనావస్థకు చేరుకున్నాయి. అయితే సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా సోషల్ మీడియాతో మళ్లీ పౌరాణిక కళలకు ఆదరణ లభిస్తోంది. గత కొన్నాళ్లగా జిల్లాలోని పడమటి మండలాల్లో పండుగలు, పబ్బాలు, శుభ కార్యక్రమాలకు నాటకాలు, హరికథలు జోరందుకున్నాయి. ఈ వృత్తులనే నమ్ముకున్న ఎందరో కళాకారులు మళ్లీ ఇప్పుడు జనాన్ని రంజింపజేస్తున్నారు.
సాంకేతిక యుగం.. సంప్రదాయం ఉష్
గతంలో పౌరాణిక, సాంఘిక నాటకాలు, మన తండ్రుల కాలంలో హరికథలు, బుర్రకథలు, రీల్ సినిమాలకు ఆదరణ ఉండేది. స్మార్ట్‌ఫోన్ల దెబ్బకు సినిమాహాళ్లు కనుమరుగయ్యాయి. ఇంటర్నెట్‌లతో నేటి సమాజం కాలం గడుపుతోంది. దీంతో కళాకారులను పట్టించుకునేవారు కరువయ్యారు.
మళ్లీ మొదలైన ఆదరణ
నేటి ట్రెండ్స్‌ను పక్కనబెట్టి యువత మళ్లీ సంప్రదాయాల్లో భాగమైన జానపదాలు, పౌరాణికాలు, హరికథల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాల్లో ఎక్కువగా నాటకాలు, కళాకారులు, హరికథల్లోని కొన్ని విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఈ ప్రదర్శనలు చూసి గ్రామాల్లోని యువకులు తమ గ్రామాల్లో ఏదేని ఉత్సవాలు, పండుగలు, దశదిన కర్మలకు ఎక్కువగా నాటకాలు, హరికథలను చెప్పిస్తున్నారు.
కళలకు ప్రాశస్త్యం పడమటి గడ్డ
తోలుబొమ్మలాట, వీధి నాటకాలు, పండరి భజనలు, హరికథలు, బుర్రకథలు, కోలాటాలు, చక్క భజనలు, లంబాడీ నృత్యాలు, డప్పు నృత్యాలు, గంగిరెద్దులాటలు, ఇంద్రజాల ప్రదర్శనలు, గొబ్బిళ్ల పాటలు తది తర సంప్రదాయ కళలు ఈ ప్రాంతంలోని జీవనంలో ఓ భాగంలో వస్తున్నాయి. ఇలాంటి కళలు పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో ఒకప్పుడు చాలా ప్రాశస్త్యం పొందినవి. సినిమాలు రాకముందు వీటిని అందరూ మక్కువగా చూసేవారు.
హరికథలకు కేరాఫ్ శివాడి సిస్టర్స్
ఇక హరికథల విషయానికొస్తే పెద్దపంజాణి మండలంలోని శివాడి సిస్టర్ కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పదుల సంఖ్యలో హరికథదాసులు, తబలా, హార్మోనియం వాయించే కళాకారులున్నారు. వీరు కళలను ప్రదర్శించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు వీటిని ఇప్పటికీ నేర్పుతున్నారు. పురుషులే కాక మహిళలు కూడా తమ నైపుణ్యంతో కథలు చెబుతున్నారు.
సంప్రదాయ కళలకు మళ్లీ పూర్వవైభవం
గ్రామాల్లో నాటకాలు, హరికథలకు ఆదరణ కళలను ప్రోత్సహిస్తున్న నేటితరం యువత పండుగలకు పల్లెల్లో నాటక ప్రదర్శనలు
మారిన ట్రెండ్
సినిమాలు రావడంతో ట్రెండ్ మారింది. కాలానికి అనుగుణంగా కళాకారులు సైతం సినిమా పాటల నృత్యాలతో అభినయం చేస్తూ రికార్డు డాన్సులతో నాటకాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వీధి నాటకాల విషయానికొస్తే వీటి ఉనికి ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఈ ప్రాంతంలోని టి.వడ్డూరు, కాబ్బల్లి, దొడ్డిపల్లి, ఏటిగడ్డిండ్లు, కొత్తఇండ్లు, మేలుమాయి, కీలపట్ల, బైరెడ్డిపల్లి, దేవదొడ్డి ప్రాంతాల్లో ఇప్పటికీ కళాకారులున్నారు. వీరికి నాటకాలు నేర్పించేందు కుప్పం ప్రాంతంలోని కంగుంది, కెనమాకులపల్లి, రామకుప్పం ప్రాంతాల నుంచి వస్తారు.
నాటకాలకు మళ్లీ ఆదరణ
ఇప్పుడు గ్రామాల్లో నాటకాలు, హరికథలు, పండరిభజనలకు ఆదరణ లభిస్తోంది. కళాకారుడు సంపాదన కోసం పాకులాడరు. కేవలం కళను ప్రదర్శించడమే ముఖ్యంగా భావిస్తాడు. మొన్నటిదాకా కళనే నమ్ముకున్న మా జీవితాలు కష్టమయ్యాయి. ఇప్పుడు చదువుకున్న యూత్ మళ్లీ నాటకాల వైపు మొగ్గు చూపుతుండడంతో కళకు జీవం వచ్చింది. – చంద్రశేఖర్,
హంస అవార్డు గ్రహీత, మర్రిమాకులపల్లె
ఆదరణ దక్కితే సంతోషం..
మళ్లీ ఇన్నాళ్లకు కళాకారులకు ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం వారి సొంత గ్రామాలకు వచ్చినప్పుడు పండగలు, పబ్బాలకు నాటకాలు, హరికథలు పెట్టించడం సంతోషం. మన సంస్కృతిలో భాగమైన సంప్రదాయకళలను రక్షించుకోవాల్సిన అవరసం నేటి యువతపై ఉంది. మాలాంటి కళాకారులను కాపాడుకోవాలి. – నాటకాల నారాయణస్వామి,
కళాకారుడు, నూనెవారిపల్లె
Comments
Please login to add a commentAdd a comment