పోలిపల్లివద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
అదుపు తప్పి డివైడర్‌ను దాటి లారీని ఢీకొట్టిన కారు
నలుగురు దుర్మరణం
మృతులంతా శ్రీకాకుళం నగర వాసులే..
అందరూ 30 ఏళ్ల వయస్సు లోపువారే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నవారు. ఆమెరికా నుంచి వస్తున్న మేనమామను తీసుకొచ్చేందుకు వెళ్తూ ఒకరు.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న భార్య, తోడుగా వెళ్తున్న భర్త.. పొట్టకూటికోసం పనిచేసే డ్రైవర్.. అందరి ప్రాణాలను రోడ్డు ప్రమాదం గాలిలో కలిపేసింది. వారి కుటుంబాలకు కన్నీటిశోకాన్ని మిగిల్చింది.
భోగాపురం/శ్రీకాకుళం క్రైమ్: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారి వద్ద శనివారం ఉదయం 8:12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఫార్చూనర్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీకాకుళం నగరానికి చెందిన గవిడి కౌశిక్ (27), వడ్డి అభినవ్ (27), అతని భార్య మణిమాల (24)తో పాటు కారు డ్రైవర్ ఎం.జయే‹Ù(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నాలుగంటే నాలుగే క్షణాల్లో జరిగిపోయింది. ఫ్రంట్ బోనెట్ పై నుండే గ్లాస్, ఇంజిన్‌లే కాక స్పీడోమీటర్ రీడింగ్ ముక్కముక్కలైందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
మేనమామ కోసం..
మృతుల్లో ఒకరైన గవిడి కౌశిక్ శ్రీకాకుళంలోని ఇందిరా జ్యుయలర్స్ యజమాని గవిడి వాసుదేవ్ కుమారుడు. బంగారు వ్యాపారి లంక బావాజీ నాయుడుకి మనుమడు. నాయుడు జ్యుయలర్స్ యజమాని లంక గాంధీ పెద్దకుమార్తె నిహారికతో కౌశిక్‌కు 2023లో వివాహమైంది. ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు. కౌశిక్ పిన్ని కుమారుడికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ శుభ కార్యానికి హాజరు కావడానికి కౌశిక్ మేనమామ బాలాజీ అమెరికా నుంచి శనివారం రానున్నారు. ఆయనను రిసీవ్ చేసుకోవడం కోసమే కౌశిక్ తన మామ గాంధీ కారులో విశాఖ బయలుదేరారు.
పరీక్ష రాసేందుకు..
శ్రీకాకుళంలోనే లియో మెడికల్ ల్యాబ్ సెంటర్ నడుపుతున్న మన్మథరావు పెద్ద కుమారుడు వడ్డి అభినవ్ కౌశిక్‌కు మంచి స్నేహితుడు. అభినవ్‌కు నాలుగేళ్ల కిందట హిరమండలానికి చెందిన మణిమాలతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు మమకార్ ఉన్నాడు. మణిమాల బ్యాంక్ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నారు. ఆమెకు శనివారం విశాఖలో పరీక్ష ఉంది. దీంతో భార్యాభర్తలు కౌశిక్‌తో కలిసి కారులో విశాఖ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గురువారమే అభినవ్ పుట్టిన రోజు కూడా జరిగింది.
జయేష్ డ్రైవర్‌గా..
ఏడాది కిందటే లంక గాంధీ ఫార్చూనర్ కారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎం.జయేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో కలిసే కౌశిక్, అభినవ్, మణిమాల విశాఖ బయల్దేరారు. జయేష్ తండ్రి మరణించడంతో తల్లి, చెల్లితో కలిసి శ్రీకాకుళానికి అనుసరించి ఉన్న కుశాలపురంలో ఉంటున్నారు. వీరి స్థిర నివాసం కృష్ణాపార్కు వద్ద సున్నపువీధి. తల్లి టీకొట్టు నడుపుతుండగా జయేష్‌కు డ్రైవింగ్ రావడంతో స్థానిక ట్రావెల్స్‌లో కొన్నాళ్లు పనిచేసి ఇటీవలే గాంధీ వద్ద డ్రైవర్‌గా చేరారు. జయేష్ చనిపోవడంతో ఇప్పుడు వారి కుటుంబానికి ఆధారం పోయింది.
ప్రమాదం జరిగిందిలా..?
శనివారం ఉదయం వీరు కారులో విశాఖ బయల్దేరారు. అప్పటికే చినుకులు పడుతుండడంతో రోడ్డు తడిగా ఉంది. నాతవలస టోల్‌గేట్ దాటిన తర్వాత సుందరపేట వద్ద కారు నిలిపి టీ తాగారు. టీ తాగి బయల్దేరిన నిమిషాల వ్యవధిలోనే భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే రహదారిపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో నిండిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌నుక్రమబద్ధీకరించారు. కౌశిక్ బాబాయ్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎన్.వి.ప్రభాకర్ తెలిపారు.
మూడేళ్ల కిందట...
పోలిపల్లి వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడేళ్ల కిందట ఇదే ప్రాంతం వద్ద తీర్థయాత్ర బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనకాలే వచ్చిన మరో వాహనం బస్సును ఢీకొట్టడంతో 39 మంది యాత్రికుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరచిపోకముందే మళ్లీ రోడ్డు ప్రమాదంలో అదే స్థలంలో నలుగురు మృతిచెందారంటూ స్థానికులు విచారం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment