దివ్య తేజశ్విని (ఫైల్‌ఫొటో)
సాక్షి, అమరావతి బ్యూరో/గుణదల/గుంటూరు రూరల్: తాను ప్రేమించిన యువతి తనతో వచ్చేందుకు తిరస్కరించడాన్ని తట్టుకోలేక ఉన్మాదిగా మారిన ఓ యువకుడు విచక్షణను కోల్పోయాడు. కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లోనే నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపాడు. తరువాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం విజయవాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. కోవిడ్ కారణంగా కళాశాల మూసివేయడంతో ఇంటివద్దనే ఉంటూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతోంది. తండ్రి జోసెఫ్ కారుడ్రైవర్. తల్లి కుసుమ గృహిణి. అన్న దినేష్‌వర్మ ప్రైవేటు ఉద్యోగి. క్రీస్తురాజపురం ఆర్‌సీఎం చర్చి ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు(25) అలియాస్ చిన్నస్వామి పెయింటర్. స్థానికంగా ఉంటున్న వీరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమాయణాన్ని పెద్దలు ఒప్పుకోరన్న భయంతో గతేడాది గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఇటీవల తమ పెళ్లి విషయాన్ని నాగేంద్రబాబు దివ్య తల్లిదండ్రులకు చెప్పి తనతో కాపురానికి పంపాలని కోరాడు. షాక్ తిన్న ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు.
ఇంజనీరింగ్ చదివి మంచి భవిష్యత్తున్న తమ కూతురు జీవితాన్ని నాశనం చేశావంటూ అతనిపై విరుచుకుపడ్డారు. పట్టువదలని నాగేంద్రబాబు పలుమార్లు దివ్య ఇంటికొచ్చి తన వెంట పంపాలంటూ గొడవ చేస్తూనే ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు ససేమిరా అంటూనే ఉన్నారు. తమ కుమార్తె మనస్సు మార్చేందుకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. దీంతో తన తల్లిదండ్రులను ఒప్పించే తనను తీసుకెళ్లాలంటూ దివ్య.. నాగేంద్రబాబుకు చెబుతూ వస్తోంది. అయితే ఆమె తల్లిదండ్రులను ఒప్పించడం అసాధ్యమన్న భావనతో నిందితుడు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయానికొచ్చాడు. గురువారం మధ్యాహ్నం దివ్య ఇంటికెళ్లాడు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు లేరు. తన వెంట రావాలని పట్టుబట్టగా దివ్య అంగీకరించకపోవడంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె మెడ, ఎడమ చేయి, మణికట్టు, కుడి పక్కటెముక, పొట్టలో 11 పోట్లు పొడిచాడు. దివ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
వెనువెంటనే అదే కత్తితో తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్నాడు. కాసేపటికి దివ్య తల్లి వచ్చేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న మాచవరం పోలీసులు ఇద్దరినీ తొలుత ఈఎస్‌ఐ ఆస్పత్రికి.. తర్వాత మెరుగైన చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి తరలించారు. అక్కడ దివ్య మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన నాగేంద్రబాబుకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. కాగా దివ్య, నాగేంద్రబాబు పెళ్లిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ పెళ్లాడారన్న కథనాలను దివ్య కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు.
ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదు: హోంమంత్రి సుచరిత
ప్రేమోన్మాది ఘాతుకం ఘటన చాలా బాధాకరమని, ఇటువంటి ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment