రాజానగరం: వ్యవసాయ రంగం ఆధునీకత వైపు పరుగులు తీస్తుంది.. దీనిని అందిపుచ్చుకుంటే సాగు బంగారమే.. కొత్తగా వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు గాను తాము రూపొందించి, వాడుకలోకి తెచ్చిన డ్రమ్ము సీడర్‌తో ఎంతగానో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. మెట్ట ప్రాంతంలో వరి విత్తనాలు నాటే విధానానికి డ్రమ్ము సీడర్ అనుకూలమైంది. దీనివల్ల సమయం ఆదాతోపాటు కూలీ సమస్య ఉండదు. శ్రమ, ఖర్చు తగ్గుతాయి. ఈ సాధనాన్ని ఉపయోగించి వరి విత్తనాలను చల్లితే క్రమపద్ధతిలో వరి మొక్కలు రావడంతోపాటు దుబ్బు బాగా కట్టి, మంచి దిగుబడులు సాధించవచ్చు. డ్రమ్ము సీడర్‌తో మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా పొలాల్లో విత్తుకుంటే పంట త్వరగా రావడంతోపాటు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని, దిగుబడి 5 నుంచి 10 శాతం వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రమ్ము సీడర్‌ని వినియోగించే విధానాన్ని రైతులకు ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. గత 16 ఏళ్లుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈ పద్ధతిలో అనేక ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి వరి సాగులో మంచి ఫలితాలు సాధించారు.
నీటి సమస్య అధిగమించొచ్చు
పొలంలో నేరుగా విత్తనాలు చల్లాలన్నా, మడులు కట్టి నారు పెంచాలన్నా పొలంలో సమృద్ధిగా నీరు ఉండాలి. అంతేకాక కూలీల అవసరం ఉంటోంది. ఈ సమస్యలను పూర్తిగా అధిగమించేందుకు పొలాల్లో నేరుగా డ్రమ్ము సీడర్‌తో వరి విత్తనాలను నాటుకోవచ్చు. ఈ పరికరం తయారు చేసే విధానాన్ని కూడా కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం సహాయకులు రైతులకు వివరిస్తున్నారు. మొలకెత్తిన విత్తనం వేసేందుకు వీలున్న నాలుగు ప్లాస్టిక్ డబ్బాలను కలిపి, ప్రతి డబ్బాకు 20 సెం.మీ. దూరంలో రంధ్రాలు చేయాలి. పరికరం సులువుగా కదలడానికి ఇరువైపులా రెండు పెద్ద చక్రాలు ఏర్పాటు చేయాలి. దానిని లాగడానికి అనువుగా హ్యేండిల్‌ను అమర్చుకోవాలి. ఇలా తయారు చేసిన తరువాత దీని బరువు 10 కిలోలను మించి ఉండదు. కొద్దిగా మొలకెత్తిన విత్తనాలను ఆ నాలుగు డబ్బాల్లో పోసి, దమ్ము చేసి, చదును చేసిన పొలాల్లో పెట్టి ముందుకు లాగడం ద్వారా విత్తనాలను నాటుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇద్దరు మనుషులు మూడు గంటల్లో ఒక ఎకరం పొలంలో ఈ విధంగా విత్తనాలు విత్తేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంలో మొక్కల పెరుగుదలతోపాటు కలుపు కూడా పెరిగే అవకాశం ఉన్నందున 15 నుంచి 20 రోజుల్లో కలుపు నివారణకు మందులను వాడాలని అధికారులు సూచించారు. అలాగే దమ్ములో 150 కిలోల సూపర్ పాస్ఫేట్‌తోపాటు 15 కిలోల పొటాష్ ఎరువును, విత్తిన 15 రోజులకు నత్రజని ఎరువును వేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment