నలుగురిలో గొప్పగా..
పతకాలు సాధిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కర్రి తేజస్వి నాగలక్ష్మిసాయి జాతీయ స్థాయిలో పలు పోటీల్లో విజేతగా నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆమె ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. 2022లో సీనియర్స్ విభాగంలో, 2023లో ఐసీఎస్‌ఈలో రజత పతకం సాధించింది. ప్రపంచ స్థాయిలో జరిగే ఆర్చరీ, ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా తర్ఫీదు పొందుతున్నానని నాగలక్ష్మి అంటోంది.
– కర్రి తేజస్వి నాగలక్ష్మిసాయి
ఆర్చరీలో అన్నాచెల్లెళ్లు
రాజమహేంద్రవరానికి చెందిన అన్నాచెల్లెళ్లు నల్లా రిత్విక్ సాయితేజ్, నల్లా వర్షిణీ శ్రీభరత్‌లు ఆర్చరీలో రాణిస్తున్నారు. ఒకే క్రీడలో అన్నాచెల్లెళ్లు జాతీయ స్థాయిలో రాణిస్తుండడం విశేషం. సాయితేజ్ ఐసీఎస్‌ఈకి రెండుసార్లు, ఓపెన్ మీట్‌కు మూడుసార్లు, ఎస్‌జీఎఫ్‌ఐకు ఒకసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయితేజ్ సైతం ఒలింపిక్స్ లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాడు. అతని సోదరి వర్షిణీ ఐసీఎస్‌ఈకి రెండు సార్లు, ఎస్‌జీఎఫ్‌ఐకి రెండు సార్లు ఎంపికైంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది.
– నల్లా రిత్విక్ సాయితేజ్, వర్షిణీ శ్రీభరత్
ఆర్చరీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు
● ఆర్చరీలో ‘తూర్పు’ క్రీడాకారుల ప్రతిభ
● జాతీయ స్థాయిలో రాణింపు
● అమలాపురంలో
ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలు
సాక్షి, అమలాపురం: రామాయణం.. మహా భారతం కాలం నాటి నుంచి నేటి ఆధునిక యుగం వరకూ విలు విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతీయ సంస్కృతి.. జీవన విధానంలో విల్లు, బాణాలు ప్రాణరక్షణతో పాటు ఆదివాసీల సహజమైన వేటకు ఉపయోగపడేవి. అటువంటి విల్లుతో నిర్వహించే పోటీలు (ఆర్చరీ)కి సైతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ ఉంది. ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వివిధ విభాగాలు, క్రీడా సంస్థలు, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆర్చరీ పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్.. అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ విభాగాల్లో భారత దేశానికి పెద్దగా పతకాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే ఈ క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ పలు విభాగాల్లో విజేతలుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ఆర్చరీ క్రీడ లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఐసీఎస్‌ఈ, ఎస్‌జీఎఫ్‌ఐ, నేషనల్ ఓపెన్ మీట్ వంటి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఆర్చరీలో ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో సత్తా చాటుతున్నారు.
పాఠశాల స్థాయిలో చేయూత
పాఠశాల స్థాయిలో క్రీడలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా అన్నారు. అమలాపురం సీవీ రామన్ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు, ఎంపికలు జరిగాయి. జిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్వర్గీయ రవణం రాంబాబు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. వీటిని డీఈఓ సలీం బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు జరగడం అభినందనీయమన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ప్రారంభోత్సవంలో సీవీ రామన్ కళాశాల డైరెక్టర్ ఆర్.వేణుగోపాలరావు, క్రీడా భారతి అధ్యక్షుడు అల్లాడి శరత్‌బాబు, కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, కార్యదర్శి గోకరకొండ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో బండారు జోషితా సూర్య తేజస్విని (జగ్గంపేట), ఎం.విశ్వతా శ్రీసాయి సూర్య హర్షిణి (అమలాపురం), జమ్మలమడక ఐశ్యర్యా సూర్యదీపిక, బండారు తేజస్వినిదేవి, పి.లక్ష్మి, ఎస్‌కే హమిడా (పిఠాపురం), బాలుర విభాగంలో వి.రిత్విక, జయసూర్యారెడ్డి, ఎస్.లీలా ప్రణవరెడ్డి, ఎస్.సతీష్ చైతన్య, (రాజమహేంద్రవరం), షేక్ లతీఫ్ వలీ, పి.నాని (పిఠాపురం), కాంపౌండ్ రౌండ్ విభాగంలో కుడప వెంకట ప్రద్యూమ్న, జి.అనిరవ సాయి, కేవీవీ కార్తికేయ కృష్ణ (రాజమహేంద్రవరం), కర్రి బుద్దేశ్వరరావు (అమలాపురం), రికర్వ్ బాలుర విభాగంలో రిత్విక్ సాయితేజ (రాజమహేంద్రవరం), ఎ.అచ్యుత శేఖర్ విజేతలుగా నిలిచారు.
క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో డీఈఓ సలీం బాషా
ఒలింపిక్స్ లక్ష్యంగా...
అమలాపురానికి చెందిన కర్రి బుద్దేశ్వరరావు జాతీయ స్థాయిలో పలు విజయాలు సాధించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అతను జాతీయ స్థాయి సీనియర్స్ విభాగంలో బంగారు పతకం, జూనియర్ నేషనల్స్‌లో రజత పతకం దక్కించుకున్నాడు. సబ్ జూనియర్స్ విభాగంలో రెండుసార్లు, జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2021లో జరిగిన అండర్–14 విభాగంలో మూడు పతకాలు, 2024లో ఎస్‌జీఎఫ్‌ఐ టీమ్ విభాగంలో కాంస్య పతకం, సీబీఎస్‌సీ జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు సాధించాడు. ఆర్చరీ విభాగంలో ఒలింపిక్స్ ఆడాలన్నదే తన లక్ష్యమని, అందుకు అనుగుణంగా నిరంతరం సాధన చేస్తున్నానని బుద్దేశ్వరరావు చెబుతున్నాడు. – కర్రి బుద్దేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment